ధరలు పెంచకపోవడంతో లీటర్ డీజిల్‌పై రూ.25 వరకు నష్టం.. జోక్యం చేసుకోండి
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించలేమని ప్రయివేటు పెట్రోల్ పంప్స్ రిటైల్ డీలర్స్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ అంశంపై కేంద్ర చమురు శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర చమురు శాఖకు జియో-బీపీ, నయారా ఎనర్జీ, షెల్ తదితర రిటైల్ డీలర్లతో కూడిన భారత పెట్రోలియం పరిశ్రమ సమాఖ్య (FIPI) జూన్ 10వ తేదీన లేఖ రాసింది. FIPI ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలను తన సభ్యులుగానే భావిస్తుంటుంది. లీటర్ డీజీల్‌పై రూ.20 నుండి రూ.25, లీటర్ పెట్రోల్‌పై రూ.14 నుండి రూ.18 నష్టానికి విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా రిటైల్ ధరలను సవరించాలని లేదంటే రిటైల్ వ్యాపారంలో మరిన్ని పెట్టలేని పరిస్థితి అని పేర్కొంది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. కంపెనీలు మనుగడ సాగించేలా చూడాలని, పెట్టుబడులు వచ్చేలా చేయాలని కోరింది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దశాబ్ద గరిష్టస్థాయికి చేరాయని, కానీ భారత్‌లో 90 శాతం మార్కెట్ కలిగిన ప్రభుత్వరంగ చమురు సంస్థలు మాత్రం ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను అందుకు అనుగుణంగా పెంచలేదని తెలిపింది. చమురు ధరలో మూడింట రెండువంతులకు సమానంగా ప్రస్తుత రిటైల్ ధరలు ఉన్నాయని పేర్కొంది. ప్రయివేటు సంస్థలు మాత్రమే ధరలు పెంచితే కొనుగోలుదారులు తమ వద్దకు వచ్చే పరిస్థితి ఉండదని, అందుకే నష్టాలను తగ్గించుకోవడానికి అమ్మకాలను పరిమితం చేయవలసి వస్తోందని తెలిపింది. 2021 నవంబర్ నుండి 2022 మార్చి వరకు నాలుగు నెలలకు పైగా ధరలు సవరించకపోవడం వల్ల నష్టాలు వచ్చాయని గుర్తు చేసింది.


Click it and Unblock the Notifications