Market News: రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైన వ్యక్తులు, సంస్థల ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటాయి. ఇందుకు సంబంధించి సదరు ఆర్థిక సంస్థలు ప్రకటనలు సైతం ఇస్తాయి. అయితే పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎప్పుడూ సన్నద్ధంగా ఉండే సెబీ.. ఇప్పుడు ఆ పని చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆశావహులను పాల్గొనవలసినదిగా కోరుతోంది.
పెట్టుబడిదారుల నుంచి ఆయా కంపెనీలు అక్రమంగా వసూలు చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. పైలాన్, విబ్‌గ్యోర్, GBC ఇండస్ట్రియల్ కార్ప్ సహా 7 కంపెనీలకు చెందిన 22 ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. జూలై 8న ఇందుకు తగిన రోజుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ అప్‌డేట్ ఇచ్చింది.

టవర్ ఇన్ఫోటెక్, వారిస్, టీచర్స్ వెల్ఫేర్ క్రెడిట్ మరియు హోల్డింగ్ గ్రూపులతో పాటు అనెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు ఆస్తులు కూడా ఇందులో భాగంగా వేలానికి రానున్నాయి. ఈ ఆస్తులు పశ్చిమ బెంగాల్‌లో ఉండగా.. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రెగ్యులేటర్ ఈ విక్రయ ప్రక్రియను ప్రారంభించింది.
మోసపోయిన ఇన్వెస్టర్ల సొమ్మును ఆయా కంపెనీల నుంచి రికవరీ చేసేందుకు గతంలో సెబీ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సదరు కంపెనీల ఆస్తులను లిక్విడేట్ చేసి పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడం కోసం జస్టిస్ శైలేంద్ర ప్రసాద్ తాలుక్దార్‌ను వన్ మ్యాన్ కమిటీగా నియమించారు. ఇప్పుడు వాటిని 45.47 కోట్ల రిజర్వ్ ధరకు వేలం వేయనున్నట్లు సెబీ జారీ చేసిన నోటీసులో పేర్కొంది.


Click it and Unblock the Notifications