SEBI News: ప్రస్తుత కాలంలో ఇండియాలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ఒక ట్రెండుగా మారింది. ఎక్కువగా ప్రస్తుత కాలంలో యువత రాకతో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ ఈక్విటీ మార్కెట్లలో పెరిగింది. అయితే ఇది ఒక విధంగా మార్కెట్లకు మంచిదే అయినప్పటికీ ఫలితాలు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నట్లు వెల్లడైంది.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయుల్లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ధోరణి పెరుగుతోంది. దేశంలో ఇతర పెట్టుబడి సాధనాలు, అవకాశాలతో పోలిస్తే మెరుగైన రాబడి కారణంగా ప్రజలు స్టాక్ మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ క్రమంలో మార్కెట్లోకి డబ్బులు తెచ్చిపెడుతున్న ప్రతి ఒక్కరికీ లాభాలు రావటం లేదన్నది నమ్మకతప్పని పచ్చినిజం. వాస్తవానికి వీరందరూ కష్టపడి సంపాదించిన తమ డబ్బును మార్కెట్లలోకి తెచ్చి పెడుతున్నారు.

ఈ క్రమంలో సెబీ గణాంకాలు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ప్రత్యేకించి చిన్న పెట్టుబడిదారులు డెరివేటివ్ విభాగంలో కాకుండా క్యాష్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసినా స్టాక్ మార్కెట్లో నష్టాలను మూటకట్టుకుంటున్నారు. మార్చి 2023తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసిన ప్రతి 10 మంది పెట్టుబడిదారుల్లో 7 మంది నష్టాలను పొందినట్లు సెబీ నివేదిక బట్టబయలు చేసింది. మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు సెబీ గుర్తించింది.
ఈక్విటీ క్యాష్ విభాగంలో ఇంట్రాడే ట్రేడ్‌లు చేస్తున్న పెట్టుబడిదారుల సంఖ్య 2018-19 నుంచి 2022-23కి ఏకంగా 300 శాతానికి పైగా పెరిగినట్లు సెబీ పేర్కొంది. F&O మాదిరిగా చాలా మంది యువ పెట్టుబడిదారులు కూడా ఇంట్రాడేలో పాల్గొంటున్నారు. ఇంట్రాడే విభాగంలో నష్టపోయిన పెట్టుబడిదారుల్లో 76 శాతం మంది 30 ఏళ్లలోపు వారుగా నివేదిక చెబుతోంది. దీనికి ముందు మార్కెట్ రెగ్యులేటర్ డెరివేటివ్స్ విభాగంలో 90 శాతానికి పైగా రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో చిన్న పెట్టుబడిదారులు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లకు సూచించింది.


Click it and Unblock the Notifications