మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలెర్ట్.. నామినేషన్ రూల్స్ మారుస్తూ ‘SEBI' కీలక నిర్ణయం!
భారతీయ షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారి కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డిమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలలో నామినేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ శుక్రవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇన్వెస్టర్ల మరణానంతరం వారి ఆస్తులు క్లెయిమ్ కాకుండా నిలిచిపోవడాన్ని తగ్గించేందుకు, అలాగే డాక్యుమెంటేషన్ తలనొప్పులను దూరం చేసేందుకు సెబీ ఈ కీలక అడుగు వేసింది. ఈ సరికొత్త నిబంధనలు సెప్టెంబర్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

సెప్టెంబర్ 1 నుండి కొత్త నియమాలు!
కొత్త నిబంధనల ప్రకారం, సెప్టెంబర్ 1, 2026 లేదా ఆ తర్వాత ఓపెన్ చేసే అన్ని సింగిల్ హోల్డర్ డీమాట్ అకౌంట్ (Demat account) , మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినేషన్ చేయడం పూర్తిగా తప్పనిసరి. ఒకవేళ ఏ ఇన్వెస్టరైనా నామినీని పెట్టకూడదు అనుకుంటే, వారు దానికి సంబంధించిన ప్రత్యేక 'ఆప్ట్-అవుట్' (Opt-out) డిక్లరేషన్ ఫారమ్‌ను కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, జాయింట్ అకౌంట్ (ఉమ్మడి ఖాతాలు) ఉన్నవారికి మాత్రం నామినేషన్ అనేది ఆప్షనల్‌గా ఉంటుంది. జాయింట్ అకౌంట్లలో నామినీని మార్చాలన్నా, రద్దు చేయాలన్నా అందరు హోల్డర్ల సమ్మతి కచ్చితంగా అవసరం.
ఒకే అకౌంట్‌కు ముగ్గురు నామినీలు!
సెబీ తీసుకొచ్చిన సరికొత్త మార్పుల ప్రకారం, ఇన్వెస్టర్లు ఇప్పుడు ఒకే డిమ్యాట్ అకౌంట్ లేదా మ్యూచువల్ ఫండ్ ఫోలియోకు గరిష్టంగా ముగ్గురు నామినీలను నియమించుకోవచ్చు. ఒకవేళ నామినేషన్ ఫారమ్‌లో ఎవరికి ఎంత శాతం వాటా (Percentage Share) ఇవ్వాలనేది మెన్షన్ చేయకపోతే.. ఆ ఆస్తులన్నీ ముగ్గురికీ సమానంగా పంపిణీ అవుతాయి. విభజన తర్వాత మిగిలిపోయే ఏదైనా అదనపు ఆస్తి లేదా ఆడ్-లాట్ హోల్డింగ్స్ మొదటి నామినీ ఖాతాలోకి బదిలీ చేయబడతాయి.
ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ప్రక్రియ మరింత సులభం!
ఇన్వెస్టర్లు తమ నామినేషన్లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో సులభంగా పూర్తి చేయవచ్చు.
- ఆన్‌లైన్ విధానం: డిజిటల్ సిగ్నేచర్లు, ఆధార్ ఆధారిత ఇ-సైన్ (e-sign), లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ , ఈమెయిల్ ఐడీలకు వచ్చే టూ-ఫ్యాక్టర్ ఓటీపీ (OTP) ద్వారా అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు.
- ఆఫ్‌లైన్ (భౌతిక) విధానం: ఇప్పటివరకు నామినేషన్ ఫారమ్‌పై సాక్షుల (Witness) సంతకాలు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇకపై ఇన్వెస్టర్లు తమ సొంత చేతివ్రాతతో సంతకం పెడితే ఎలాంటి సాక్షుల వివరాలు అవసరం లేదని సెబీ స్పష్టం చేసింది. ఒకవేళ సంతకానికి బదులు బొటనవేలి ముద్ర (Thumb Impression) వేస్తే మాత్రమే సాక్షుల సంతకాలు అవసరమవుతాయి.
వివరాల వెల్లడిలో భారీ మినహాయింపు!
ఫారమ్‌లు నింపేటప్పుడు అనవసరమైన వివరాలు అడగకుండా సెబీ నిబంధనలను సవరించింది. ఇకపై నామినేషన్ ఫారమ్‌లో నామినీ పేరు , అకౌంట్ హోల్డర్‌తో ఉన్న బంధుత్వం (Relationship) చెబితే సరిపోతుంది. నామినీ కాంటాక్ట్ నంబర్, కేవైసీ (KYC) వివరాలు, వాటా శాతాలు వంటివి ఆప్షనల్ మాత్రమే. నామినీ గనుక మైనర్ (మైనారిటీ తీరని వాడు) అయితేనే వారి పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి.
నామినీ లేకపోతే ఏమవుతుంది?
ఒకవేళ ఏ నామినీని నియమించకుండా 'ఆప్ట్-అవుట్' ఎంచుకుంటే.. భవిష్యత్తులో సదరు ఇన్వెస్టర్ మరణిస్తే ఆ సెక్యూరిటీలను చట్టపరమైన వారసులకు బదిలీ చేయడంలో చాలా ఆలస్యం అవుతుందని, ఒక దశలో ఆ ఆస్తులు 'క్లెయిమ్ చేయని ఆస్తులు' (Unclaimed Assets) గా మిగిలిపోయే ప్రమాదం ఉందని సెబీ హెచ్చరించింది. ఇందుకోసం డిపాజిటరీ పార్టిసిపెంట్లు , మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్లు ఏటా రెండుసార్లు ఎస్ఎంఎస్, ఈమెయిల్‌ల ద్వారా ఇన్వెస్టర్లకు రిమైండర్లను పంపాల్సి ఉంటుంది. 2021 నుండి 2025 మధ్య నామినేషన్లపై ఇచ్చిన పాత ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తూ సెబీ ఈ సరికొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది.


Click it and Unblock the Notifications