SEBI: దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆర్థిక మార్కెట్లను నియంత్రించే సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI). పెట్టుబడిదారుల సంపదను పరిరక్షించడం, మార్కెట్ల నిర్వహణ సవ్యంగా సాగేలా చేయడం దీని విధి. ఏప్రిల్ 12, 1988న సెక్యూరిటీస్ మరియు కమొడిటీస్ ను నియంత్రించడానికి సెబీని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది.
35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశీయ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ తన కొత్త లోగోను ఆవిష్కరించింది. ముంబైలోని దాని ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. సంస్థకు చెందిన మాజీ చైర్మన్లు, సభ్యులతో పాటు ప్రస్తుత సిబ్బంది సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. సెబీ చైర్ పర్సన్ శ్రీమతి మధబి పూరీ బుచ్ చేతుల మీదుగా లోగో విడుదలైంది.

సెబీ సంప్రదాయాలు, న్యూ డేటా, సాంకేతిక ఆధారిత విధానాల విశిష్ఠ కలయికతో కొత్త లోగోను రూపొందించినట్లు చైర్ పర్సన్ మధబి పూరీ బుచ్ తెలిపారు. అభివృద్ధి, సెక్యూరిటీస్ మార్కెట్, పెట్టుబడిదారుల భద్రతకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ, సంస్థ విధానాన్ని ప్రతిబింబించేలా చూస్తుందని వెల్లడించారు. సంప్రదాయ నీలిరంగుల పాలెట్ తో, ఆధునిక భారత్ ఆకాంక్షకు ప్రాముఖ్యత ఇచ్చేలా ఉంటుందన్నారు.

మూలధన నిర్మాణం, నిర్వహణ ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడం తన ప్రథమ కర్తవ్యమని సెబీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తున్నట్లు చెప్పింది. డేటా పవర్ ని గుర్తిస్తూ, విధాన రూపకల్పనలో మెరుగ్గా వినియోగించుకోవడానికి యత్నిస్తున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications