Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి కోసం.. ఈ మధ్యకాలంలో సెబీ పలు నిబంధనలను అమల్లోకి తీసుకువస్తోంది. ఇటీవల నామినీని జత చేసేందుకు తుది గడువును విధించిన నియంత్రణ సంస్థ.. ఇప్పుడు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు విధించే ఛార్జీలపై ఫోకస్ పెట్టింది. అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఓ కొత్త విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నట్లు పేర్కొంది.
AMC ఛార్జీలపై ఆరా:
వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ పథకాలపై అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు విధించే ఛార్జీల మీద క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ దృష్టి సారించింది.
వీటి నియంత్రణ కోసం మంచి మార్గాన్ని తయారుచేసే దిశగా ప్రయత్నిస్తోంది. మ్యూచువల్ ఫండ్(MF) పరిశ్రమకు చెందిన ముఖ్యులతో ఇందుకోసం చర్చలు జరపనుంది. బోర్డు సమావేశం అనంతరం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఛైర్‌పర్సన్ మధబి పూరి బుచ్ ఈమేరకు భవిష్యత్ ప్రణాళికను వెల్లడిచారు.

వ్యయ నిష్పత్తిపై సమీక్ష:
"మ్యూచువల్ ఫండ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం సృష్టించాలనే కోరిక సెబీకి లేదు. కానీ వ్యయ నిష్పత్తుల(ఎస్‌పెన్స్ రేషియో)ను నియంత్రించే మార్గదర్శక సూత్రాలను MFలు తప్పనిసరిగా పాటించాలి" అని పూరి బుచ్ తెలిపారు. కొన్ని మార్గదర్శక సూత్రాల ఆధారంగా, వ్యయ నిష్పత్తిని సెబీ సమీక్షించింది. ఫలితంగా వ్యయ నిష్పత్తిలో స్పష్టత, ఖర్చులన్నిటినీ కవర్ చేయడం తప్పనిసరి చేయాలనుకోవడం వాటిలో అతి ముఖ్యమైనవి.
అనవసర కొత్త పథకాల దూకుడు:
ప్రస్తుత నిబంధనల ద్వారా పథకాల విభజనకు సెబీ ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లు సంస్థ ఛైర్ పర్సన్ అభిప్రాయపడ్డారు. తద్వారా NFOల పేరిట ఇష్టారీతిగా అమ్మకాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా పద్ధతి మంచిది కాదని, ఇటువంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యయ నిష్పత్తిని అధికంగా పొందడం కోసం ఇప్పటికే ఉన్న వాటిని అనుసరిస్తూ, అవసరం లేని కొత్త పథకాలను దూకుడుగా ప్రారంభిస్తున్నాయని ఆరోపించారు.
రెట్టింపు ఛార్జ్ వసూళ్లు:
ఓ వైపు వ్యయ నిష్పత్తిని వసూలు చేస్తూనే, మరోవైపు ఫండ్ మేనేజర్ నియామకం ఖర్చును విడిగా తీసుకోవడం పట్ల సెబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి.. యూనిట్ హోల్డర్ల నుంచి రెట్టింపు ఛార్జ్ చేయడంతో సమానమని పేర్కొంది. గతేడాది డిసెంబరులో మ్యూచువల్ ఫండ్స్ విధించిన ఫీజులు, ఛార్జీలపై నియంత్రణ సంస్థ ఇప్పటికే అధ్యయనం చేపట్టడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications