MF Charges: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్ న్యూస్.. ఇకపై తగ్గనున్న ఛార్జీలివే..
MF Charges: అధిక రిటర్న్ లు జనరేట్ చేసే పెట్టుబడి సాధనాల్లో ఒకటి మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్ గురించి అంతగా అవగాహన లేకున్నా, దాని ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించడానికి ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. అయితే ఇలాంటి ఫండ్స్ మార్కెట్ లో కోకొల్లలు. వాటిలో ఏ ఫండ్ సెలక్ట్ చేసుకోవాలి అని చూసేటప్పుడు ఖచ్చితంగా 'ఎక్స్ పెన్స్ రేషియో'ని గమనిస్తుంటారు. సరిగ్గా దీనిపైనే ఇప్పుడు సెబీ ఫోకస్ పెట్టింది.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో పలు మార్పులు జరుగనున్నాయి. వీటి ద్వారా పెట్టుబడిదారుల మీద విధించే ఖర్చులను తగ్గించే దిశగా సెబీ ప్రణాళికలు రచిస్తోంది. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల ఆధారంగా మొత్తం వ్యయ నిష్పత్తికి పరిమితులు సెట్ చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ భావిస్తోంది. ఈ ఆస్తులు పెరిగేకొద్దీ ఒక ఫార్ములా ఆధారంగా అనుమతించదగిన ఖర్చు తగ్గించేందుకు ప్రపోజల్ పెట్టింది.

మొత్తం వ్యయ నిష్పత్తి(TER) అనేది మ్యూచువల్ ఫండ్ రోజువారీ నికర ఆస్తి విలువ(NAV)లో ఒక శాతం మరియు పెట్టుబడిదారుడు చెల్లించే ఛార్జీల మొత్తం. ప్రస్తుతం ఫండ్ మేనేజింగ్ కంపెనీలు ఏళ్ల తరబడి అమలులో ఉన్న ఫార్ములా ఆధారంగా TERని వసూలు చేస్తున్నాయి. ఫండ్ స్థాయిలో నిర్వహణలో ఉన్న ఆస్తులపై ఆధారపడి ఈ మొత్తం ఉంటుంది. అంటే నిర్వహణలో ఉన్న ఆస్తులు పెరిగేకొద్దీ, TER ఛార్జీ తగ్గుతూ వస్తుంది.
ప్రతిపాదిత మార్పుల ప్రకారం.. నిర్వహణలోని మొత్తం ఈక్విటీ ఆస్తుల ఆధారంగా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఛార్జ్ చేయదగిన గరిష్ఠ TERని ఒక ఫార్ములా నియంత్రిస్తుంది. నాన్-ఈక్విటీ ఫండ్లకు సైతం ఇదే ఫార్ములా ప్రతిపాదించబడింది. హైబ్రిడ్ స్కీమ్స్ పై విధించే TER.. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహణలో ఉన్న ఈక్విటీ మరియు నాన్-ఈక్విటీ ఆస్తులపై ఆధారపడి ఉంటుంది.

గతేడాది మార్చి 31 నాటికి, పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తులలో దాదాపు 75 శాతం అగ్రశ్రేణికి చెందిన 8 మ్యూచువల్ ఫండ్స్ నియంత్రణలో ఉన్నాయని మార్కెట్ నియంత్రణ సంస్థ గుర్తించింది. ప్రస్తుత మార్పు ద్వారా పెట్టుబడిదారులపై తక్కువ TER విధించేలా చూడాలని ప్రయత్నిస్తోంది. బ్రోకరేజ్ మరియు లావాదేవీల ఖర్చులను TER లోకి తీసుకురావాలని SEBI ప్రతిపాదించింది. ఫండ్ హౌస్‌ల నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ఈ పద్ధతి వల్ల సాధ్యమవుతుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications