Coffee day: గ్రామాలు, పట్టణాల సంగతి పక్కన పెడితే నగరాల్లో 'కాఫీ డే' అంటే దాదాపు అందరికీ పరిచయమే. నిధుల మళ్లింపు విషయమై ఆ సంస్థ ఆరోపణలు ఎదుర్కోగా.. సెబీ కోటి జరిమానా విధించింది. రూ.3,535 కోట్ల మళ్లింపునకు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ పాల్పడినట్లు పేర్కొంది. దానికి సహకరించినందుకు మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్‌లపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ కొరడా ఝళిపించింది.
45 రోజుల్లో చెల్లించాలి:
మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్(MACEL), కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(CDEL)లు ఒకరి నియంత్రణలోనే ఉన్నాయి. దివంగత VG సిద్ధార్థ మరియు అతని కుటుంబ సభ్యులు వీటిని నడిపిస్తున్నారు. అయితే 45 రోజుల్లో పెనాల్టీ మొత్తం రూ.కోటిని చెల్లించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఆదేశించింది.

ఉత్తర్వుల్లో ఏముందంటే..
"MACEL కేవలం CDEL చేసిన నిధుల మళ్లింపునకు ఓ మార్గంగా మాత్రమే పనిచేసింది. CDEL అనుబంధ సంస్థల నుంచి MACELకి, అక్కడి నుంచి VGS నియంత్రణలోని ఇతర సంస్థలకు దాదాపు మూడన్నర వేల కోట్లకు పైగా మళ్లించడంలో సహాయ పడింది. సెబీ చట్టం, PFUTP (మోసపూరిత మరియు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిషేధం) నిబంధనలను ఆయా సంస్థలు, వ్యక్తులు ఉల్లంఘించారు" అని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆ సూసైడ్ నోట్‌తో..
VGS మరణించే వరకు ఈ తరహా నిధుల మళ్లింపు విషయం పెట్టుబడిదారులకు తెలియదు. కాఫీ డే గ్రూప్ చైర్మన్‌గా ఉన్న VG సిద్ధార్థ జూలై 2019లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు కాఫీ డే కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఓ సూసైడ్ నోట్ రాశారు. తాను విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయినట్లు అందులో వెల్లడించారు.
గతంలో జరిగింది ఇది:
సిద్ధార్థ మరణానంతరం కంపెనీల ఖాతా పుస్తకాలు, దాని అనుబంధ సంస్థలపై దర్యాప్తు చేయడానికి 2019 సెప్టెంబర్‌లో CDEL పూనుకుంది. ఇందుకోసం CBI మాజీ DIG అశోక్ కుమార్ మల్హోత్రా, అగస్త్య లీగల్ LLPల సేవలను బోర్డు వినియోగించుకుంది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉన్నందున నిధుల మళ్లింపు విషయమై సెబీ సైతం స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించింది. కాగా జనవరిలో, అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీకి నిధులు మళ్లించినట్లు గుర్తించింది. అందువల్ల కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌పై 26 కోట్లు జరిమానా విధించింది.


Click it and Unblock the Notifications