Viral News: స్టాక్ మార్కెట్‌లో కలకలం.. కోట్లాది రూపాయల స్టాక్ మ్యానిప్యులేషన్.. ప్రముఖ టీవీ షో ద్వారా..
stock manipulation: స్టాక్ మార్కెట్ లో జరిగే అవకతవకలు, మోసాలను ఎప్పటికప్పుడు గుర్తించి అడ్డుకట్ట వేయడంలో సెబీ ముందుటుంది. ఈ తరహా వ్యవహారాన్ని గుర్తించిన మార్కెట్ నియంత్రణ సంస్థ.. 10 మందిపై నిషేధం విధించింది. ఈ కుట్రపూరిత కార్యకలాపాలు జరిగింది మనందరికీ సుపరిచితమైన ప్రముఖ టీవీ ఛానల్ షో వల్లనే కావడం కొసమెరుపు.
స్టాక్ సిఫార్సులపై ముందస్తు సమాచారం ఇస్తూ కొందరు గెస్ట్ నిపుణులు అవకతవకలు పాల్పడుతున్నట్లు సెబీ గుర్తించింది. 'జీ బిజినెస్'లో షో ప్రసారానికి ముందే నిర్దిష్ట ప్రాఫిట్ మేకర్స్ సంస్థలతో వివరాలు పంచుకుంటున్నట్లు కనుగొంది. దీంతో ఆ బిజినెస్ న్యూస్ ఛానెల్‌లో కనిపించే నిపుణులు సహా 10 ఎంటిటీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ సమాచారం ఆధారంగా ప్రాఫిట్ మేకర్స్ ఆయా స్టాక్స్ కు సంబంధించిన కాంట్రాక్ట్స్ లో ముందే పొజిషన్ తీసుకుంటున్నారు. వార్తా ఛానల్ లో సిఫార్సును ప్రసారం చేసిన తర్వాత తమ పొజిషన్ రివర్స్ లేదా స్క్వేర్ ఆఫ్ చేస్తున్నారు. ఈ తరహా స్టాక్ మానిప్యులేషన్ ద్వారా ఇప్పటివరకు చట్టవిరుద్ధంగా వారు సంపాదించిన 7.41 కోట్ల లాభాలను కూడా స్వాధీనం చేసుకోవాలని నియంత్రణ సంస్థ ఆదేశించింది.
సెబీ తన మధ్యంతర ఉత్తర్వుల్లో నిర్మల్ కుమార్ సోనీ, పార్థ సారథి ధర్, సార్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, మనన్ షేర్‌కామ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు కన్హ్యా ట్రేడింగ్ కంపెనీలు ఈ విధంగా లాభాలను ఆర్జించినట్లు పేర్కొంది. ఇక గెస్ట్ ఎక్స్‌పర్ట్స్ కిరణ్ జాదవ్, ఆశిష్ కేల్కర్, హిమాన్షు గుప్తా, ముదిత్ గోయల్ మరియు సిమి భౌమిక్ లకు దీంతో సంబంధం ఉన్నట్లు తేల్చింది.
మొత్తం 10 ఎంటిటీలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీలను కొనడం, విక్రయించడం లేదా లావాదేవీలు చేయకుండా నిరోధించింది. అలాగే గెస్ట్ నిపుణులకు సంబంధించిన అన్ని రికార్డులు, కంటెంట్ తో పాటు డాక్యుమెంట్‌ల వీడియోలను చివరి ఆదేశాలు వెలువడేంత వరకు భద్రపరచాలని జీ మీడియా కార్పొరేషన్‌ని కోరింది.


Click it and Unblock the Notifications