mutual funds: మ్యూచువల్ ఫండ్స్ నామినేషన్ల విషయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొంత ఉపశమనం ఇచ్చింది. నామినీలను యాడ్ చేసేందుకు చివరి తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. నామినీలను జోడించడం లేదా పూర్తిగా వైదొలగడాన్ని జూన్ 2022లో మార్కెట్ నియంత్రణ సంస్థ తప్పనిసరి చేసింది. ఇందుకు తుది గడువును మార్చి 31, 2023గా నిర్ణయించగా.. ఈ పని పూర్తిచేయడానికి ప్రస్తుతం మరికొంత సమయాన్ని ఇచ్చింది.
'నామినేషన్ చేయని పక్షంలో మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను కలిగి ఉన్న ప్రస్తుత వ్యక్తిగత యూనిట్ హోల్డర్ల ఫోలియోలు డెబిట్‌ల కోసం స్తంభింపజేయబడతాయి. అయితే మార్కెట్ పార్టిసిపెంట్ల నుండి వచ్చిన రిక్వెస్ట్‌లను పరిగణలోనికి తీసుకోవడంతో.. మార్చి 31, 2023కి బదులుగా చివరి తేదీని సెప్టెంబర్ 30, 2023గా నిర్ణయించాం' అని సెబీ తన తాజా ప్రకటనలో తెలిపింది.

యూనిట్ హోల్డర్‌లు అందరికీ ఇ-మెయిల్, SMSల ద్వారా నామినేషన్ నిబంధనను తెలపాలని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు), రిజిస్ట్రార్ మరియు ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు (RTAలు)ను సెబీ ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలా పక్షం రోజుల్లో వారిని ప్రోత్సహించాలని కోరింది. నామినేషన్‌ను అమలు చేయడంతోపాటు నిలిపివేయడం కోసం ఓ ప్రత్యేక ఫార్మాట్‌ను రెగ్యులేటరీ నిర్దేశించింది.
నామినేషన్లను సమర్పించడానికి లేదా వైదొలగడం కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ (భౌతిక) సౌకర్యాలను మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు కల్పించాలని సెబీ సూచించింది. ఇందుకోసం ఫారం నింపి ఫండ్ హైస్‌లకు లేదా రిజిస్ట్రార్ మరియు బదిలీ ఏజెంట్లకు సమర్పించాలని తెలిపింది. డిక్లరేషన్ ఇవ్వని వారి ఫోలియోలు స్తంభింపజేయబడతాయని పేర్కొంది. తద్వారా పెట్టుబడిదారులు తమ యూనిట్లను విక్రయించలేరని హెచ్చరించింది.


Click it and Unblock the Notifications