Sahara News: దేశంలో సహారా గ్రూప్ అంటే తెలియని వారు ఉండరు అనటం అతిశయోక్తి కాదు. దశాబ్ధం కిందట అనేక మంది సామాన్య కుటుంబాలు సైతం చిన్న మెుత్తంలో తమ డబ్బును దాచుకున్న వేల కోట్ల విలువైన కంపెనీ ఇది. ఫైనాన్స్ నుంచి రియల్టీ వరకు అనేక వ్యాపారాలను ఇది నిర్వహించింది.
తాజాగా కంపెనీ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ చాలా కాలం ఆరోగ్య సమస్యలతో బాధపడి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే సుబ్రతా రాయ్ మరణం తర్వాత క్యాపిటల్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెబీ సహారా గ్రూప్‌పై కేసును కొనసాగిస్తోంది. ఈ కేసు ఒక ఎంటిటీ ప్రవర్తనకు సంబంధించినదంటూ ఫిక్కీ ఈవెంట్‌లో విలేకరులతో మాట్లాడుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ స్పష్టం చేశారు. ఎవరైనా జీవించి ఉన్నా లేక మరణించిన కేసు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 30, 2009న సహారా గ్రూప్ కంపెనీ ప్రైమ్ సిటీ ఐపీవో కోసం SEBI వద్ద ముసాయిదాను దాఖలు చేసింది. అయితే ఇందులో రియల్ ఎస్టేట్, హౌసింగ్ కంపెనీల నిధుల సేకరణ ప్రక్రియలో సెబీ లోపాలను గుర్తించింది. ఇదే క్రమంలో డిసెంబరు 25, 2009, జనవరి 2010న రెండు కంపెనీలు పూర్తిగా కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా డబ్బును సేకరిస్తున్నట్లు సెబీ ఫిర్యాదులను అందుకుంది. దీని ద్వారా కంపెనీ దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది నుంచి సుమారు రూ.24,000 కోట్లను సమీకరించినట్లు సెబీకి తెలిసింది.
అసలు బాండ్లను జారీ చేసేందుకు సహారా సంస్థ సెబీ నుంచి తగిన అనుమతులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. విషయం సుప్రీం కోర్టుకు చేరుకోవటంతో 2012లో ఇన్వెస్టర్ల వివరాలను సెబీకి ఇవ్వాలని అలాగే ప్రజల నుంచి సేకరించిన మెుత్తాన్ని 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని కోర్టు సహారా యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో 2013లో సహారా మెుత్తం 127 ట్రక్కుల్లో OFCD పత్రాలను సెబీకి పంపింది. దీంతో అప్పట్లో ముంబై శివార్లలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ తర్వాత ఫిబ్రవరి 28, 2014లో ఇన్వెస్టర్లకు రూ.24,400 కోట్లను తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్‌కి సూచించింది. అప్పటి నుంచి కేసు కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications