SEBI News: గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చురుకుగా కొత్త పద్ధతుల అమలుతో దూసుకుపోతోంది. ఇన్వెస్టర్ల రక్షణతో పాటు వారికి మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక కీలక మార్పులు చేపడుతోంది.
మార్చి 2024 నాటికి దేశీయ స్టాక్ మార్కెట్లలో నిర్వహించే ట్రేడ్‌లను అదే రోజు సెటిల్‌మెంట్ పూర్తి చేసేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్లు సెబీ చీఫ్ మాధబీ పూరీ బుచ్ పేర్కొన్నారు. నిన్న జరిగిన సెబీ బోర్డు సమావేశం తర్వాత ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికోసం మార్కెట్ మౌలిక సదుపాయాలు, బ్రోకరేజీల సాంకేతిక అవసరమని అన్నారు. దీని తర్వాత సెబీ తక్షణ సెటిల్మెంట్ వైపు అడుగులు వేస్తోంది.

స్టాక్ మార్కెట్లలో ఉన్న వారు ప్రస్తుతం T+0 ప్రారంభించాలని.. ఆ తర్వాత తక్షణ సెటిల్మెంట్ వైపు వెళ్లాలని సూచించినట్లు మాధబి బుచ్ పేర్కొన్నారు. అయితే తక్షణ సెటిల్మెంట్ అందుబాటులోకి రావటానికి మరో ఏడాది సమయం పడుతుందని ఆమె స్పష్టం చేశారు. అంటే 2025లో పెట్టుబడిదారులు మరింత వేగవంతమైన సెటిల్మెంట్ వ్యవస్థను చూస్తారని తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచే భారత స్టాక్ మార్కెట్లలో సెటిల్మెంట్ పద్ధతి T+1కి మారింది. అంటే ట్రేడింగ్ జరిగిన మరుసటి రోజునే ట్రాన్సాక్షన్ల సెటిల్మెంట్ పూర్తవుతుంది. సేమ్ డే ఈక్విటీ మార్కెట్ ట్రేడ్‌ల సెటిల్‌మెంట్‌ను అనుమతించే మార్కెట్ రెగ్యులేటర్ ప్రణాళిక ఆఫ్‌షోర్ పెట్టుబడిదారుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇది ట్రేడింగ్ ఖర్చును పెంచుతుంది. ఎందుకంటే అదే రోజులో లావాదేవీలు జరిపి, వ్యాపారాన్ని సెటిల్ చేయడానికి ఒక విదేశీ పెట్టుబడిదారుడు ట్రేడ్‌కు ఒక రోజు ముందర నిధులను భారతీయ రూపాయిలలోకి మార్చవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications