SEBI: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారుల సంపదను రక్షించే విషయంలో సెబీ పాత్ర ఎనలేనిది. ఎటువంటి మోసాలు, అవకతవకలు జరిగేందుకు ఛాన్స్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా, క్లయింట్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ పై కన్నెర్ర జేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఏడేళ్ల పాటు నిషేధించింది.
కార్వీకి చెందిన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్‌లను ఏ పబ్లిక్-లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్ లేదా కీలకమైన మేనేజీరియల్ పదవిని నిర్వహించకుండా రెండేళ్లపాటు దూరం పెట్టింది. వివిధ సెక్యూరిటీల మార్కెట్ చట్టాలను ఉల్లంఘించినందుకు కంపెనీపై 13 కోట్లు, పార్థసారథిపై 8 కోట్ల పెనాల్టీని సైతం రెగ్యులేటర్ విధించింది. సంస్థ చేసిన మోసానికి స్వతంత్ర డైరెక్టర్లు బాధ్యత వహించాల్సి వచ్చిన మొదటి కేసు ఇదే కావడం విశేషం.

కొత్త క్లయింట్‌లను తీసుకోకుండా 2019లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కార్వీని సెక్యురిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిషేధించింది. NSE సమర్పించిన నివేదికను బట్టి చూస్తే క్లయింట్ల నిధులలో అనేక అవకతవకలు ఉన్నాయని తేలింది. కార్వీ తన ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి, క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేయడం ద్వారా నిధులను సేకరించినట్లు వెల్లడైంది. అనంతరం సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
క్లయింట్‌ల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి సేకరించిన ఈ నిధులు.. మరో రెండు అనుబంధ సంస్థలకు బదిలీ చేయబడ్డాయి. కార్వీ రియాల్టీ మరియు కార్వీ క్యాపిటల్ కు దాదాపు 1,443 కోట్ల ట్రాన్స్ ఫర్ జరిగినట్లు సెబీ పేర్కొంది. రెగ్యులేటర్ ప్రస్తుత ఆదేశాల ప్రకారం వీటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కార్వీ వివిధ సెక్యూరిటీల రూల్స్ తో పాటు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిబంధనలనూ ఉల్లంఘించింది. తన ఖాతాదారుల చట్టబద్ధమైన ప్రయోజనాలను విస్మరించి, స్వంత అనుబంధ సంస్థలకు మేలు చేసినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications