సుప్రీంకోర్టు ఎఫెక్ట్: రూ.7500 కోట్ల మారటోరియం రీఫండ్ భారం, ఎన్పీఏలు రూ.1.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: లోన్ మారటోరియం, ఎన్పీఏలకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బ్యాంకుల బ్యాడ్ లోన్‌లు రూ.1.13 లక్షల కోట్లు పెరగవచ్చునని, అలాగే, రూ.2 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న వారికి కూడా మారటోరియం వ్యవధిలో చక్రవడ్డీని మాఫీ చేయాలన్న సుప్రీం ఆదేశాలతో రుణదాతలపై అదనంగా రూ.7500 కోట్ల వరకు భారం పడవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ మాఫీ సాధ్యం కాదని, మారటోరియం పొడిగింపు కూడా ఉండదని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తేల్చి చెప్పింది. అయితే వడ్డీ మీద వడ్డీ మాఫీ ఉంటుందని పేర్కొంది.

బ్యాంకులపై మారటోరియం వడ్డీ మీద వడ్డీ కొత్త భారం ఎంతంటే
ఇదివరకు రూ.2 కోట్లకు తక్కువగా రుణాలు ఉన్న వారికి మారటోరియం కాలంలో వడ్డీ మీద వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు రుణగ్రహీతలందరికీ అంటే రూ.2 కోట్లకు మించి రుణాలు తీసుకున్న వారికి కూడా వర్తింప చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకులపై ఈ భారం పడుతుంది. లోన్ మారటోరియం కాలంలోని ఆరు నెలలకు గాను అందరు రుణ గ్రహీతల చక్రవడ్డీ అంచనా రూ.13500 కోట్ల నుండి రూ.14000 కోట్లు. మోడీ ప్రభుత్వం రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీ మీద వడ్డీని మాఫీ చేసిందని, దీంతో రూ.6500 కోట్లకు పైగా భారం పడుతుందని, తాజాగా ఇప్పుడు అందరికీ మాఫీ చేయాలని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో మరో రూ.7500 కోట్ల భారం పడుతుందంని ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనిల్ గుప్తా అన్నారు.

ఇక వారికీ చెల్లింపు
రుణగ్రహీతల తాజా భారం రూ.7000 కోట్ల నుండి రూ.7500 కోట్ల వరకు ఉంటుందని అంచనా చెబుతున్నారు. ఇప్పటికే చక్రవడ్డీకి సంబంధించి రుణగ్రహీతలకు కంపెన్షేషన్ చెల్లించినందున, తాజా సుప్రీం నిర్ణయంతో త్వరలో రూ.2 కోట్లకు మించి తీసుకున్న రుణగ్రహీతలకు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని భావిస్తున్నారు.

ఎన్పీఏలు ప్రకటిస్తే...
సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో బ్యాంకులు ఎన్పీఏలు ప్రకటిస్తే, బ్యాంకుల ఎన్పీఏలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇక్రా అంచనా ప్రకారం బ్యాంకుల గ్రాస్ ఎన్పీఏలు రూ.8.7 లక్షల కోట్లు లేదా 8.3 శాతానికి పెరగవచ్చు. డిసెంబర్ 2020 నాటికి ఇవి రూ.7.4 లక్షల కోట్లు లేదా 7.1 శాతంగా ఉన్నాయి. బ్యాంకుల నెట్ ఎన్పీఏలు రూ.2.7 లక్షల కోట్లు లేదా 2.7 శాతానికి పెరుగుతుందని అంచనా. ఇది 31 డిసెంబర్ 2020 నాటికి రూ.1.7 లక్షల కోట్లు లేదా 1.7 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications