SBI: Yes బ్యాంకులో వాటా తగ్గించుకోనున్న SBI.. కారణమేమిటంటే..
SBI: కరోనా ప్రారంభమైన తరుణంలో Yes బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే. కేంద్రం సైతం ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా ఆదుకోవడానికి ప్రయత్నించింది. ఎట్టకేలకు మూలధనాన్ని ఇన్ఫ్యూజ్ చేసి దివాళా స్థితి నుంచి తప్పించింది. SBI పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఈ పెట్టుబడులకు సంబంధించి మూడేళ్ల లాకింగ్ పీరియడ్ ను విధించింది. త్వరలో అది ముగియనుండటంతో అందులో ఇన్వెస్ట్ చేసిన బ్యాంకర్లు పెట్టుబడిని అలాగే ఉంచుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.

ముగిసిన లాకిన్ పీరియడ్:
మార్చి 13న Yes బ్యాంక్ షేర్లపై విధించిన లాకిన్ పీరియడ్ ముగియనుంది. అనంతరం అందులో తన వాటాను తగ్గించుకోవాలని SBI చూస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. Yes బ్యాంకు సంక్షోభ సమయంలో.. కేంద్రం, RBI సూచనల మేరకు 49 శాతం వాటాని SBI కొనుగోలు చేసింది. అయితే ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం డిసెంబర్ 31 నాటికి 26.14 శాతంతో ఇప్పటికీ అతి పెద్ద వాటాదారుగా కొనసాగుతోంది. 26 శాతం కంటే తక్కువకు తగ్గించుకునే అవకాశం SBIకి ఇప్పటి వరకూ లేదు. ఇప్పుడు లాకిన్ పూర్తి కావడంతో ఇంకొంత మేరకు కట్ చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆర్బీఐ ఆమోదమే తరువాయి:
Yes బ్యాంకులో తన వాటా పై నిర్ణయం తీసుకోవడానికి SBI బోర్డు త్వరలోనే సమావేశం కానుంది. అనంతరం ఈ మేరకు RBIకి ప్రతిపాదనలు పంపించనుంది. ఈ వార్తలు బయటకు రావడంతో Yes బ్యాంకు షేర్లు రోజు గరిష్ట స్థాయి నుంచి నిన్న 7 శాతం మేర పడిపోయాయి. కాగా ఈరోజు దాదాపు మరో 4 శాతం వరకు కుప్పకూలాయి. లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే పునర్వ్యవస్థీకరణ నుంచి ఆయా ఆర్థిక సంస్థలు బయటకు వెళ్లేందుకు RBI అనుమతిస్తుందని Yes బ్యాంక్ గత సెప్టెంబర్ లో పేర్కొంది.

ఇవీ ఇతర బ్యాంకుల వాటాలు:
Yes బ్యాంక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ లాకింగ్ పీరియడ్ ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం మూలధనం ఇన్ఫ్యూజ్ చేసిన తేదీ నుంచి మూడేళ్లలోపు తమ వాటాను ఏ బ్యాంకూ తగ్గించుకోకూడదు. ఇవే నిబంధనలు SBIతో పాటు ICICI, యాక్సిస్, IDFC ఫస్ట్ బ్యాంకు, కొటక్ మహీంద్ర, HDFCలకూ వర్తిస్తాయి. ఇతర బ్యాంకులు వరుసగా 2.61, 1.57, 1.0,3.48 శాతం వాటాను ప్రస్తుతం కలిగి ఉన్నాయి. వీటికి తోడు LIC 4.34 శాతంతో భాగస్వామిగా ఉంది.


Click it and Unblock the Notifications