SBI SWEET warning: దేశంలోని అతిపెద్ద రుణదాతగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు నూతన పథకాలు, విధానాలను ప్రవేశపెడుతూ.. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయతిస్తూ ఉంటుంది. సకాలంలో లోన్లు తిరిగి చెల్లించని వారిపట్ల కొత్త పంథాలో వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
రిటైల్ రుణగ్రహీతలు, నెలవారీ వాయిదాలు కట్టడంలో డీఫాల్ట్ అయ్యే అవకాశం ఉన్న వారికి.. SBI చాక్లెట్ ప్యాక్ లు పంపిస్తోంది. ఈ విధంగా శుభాకాంక్షలు తెలపడం ద్వారా సకాలంలో తిరిగి చెల్లింపులు జరిగేలా కొత్త మార్గాన్ని అవలంభిస్తోంది. సాధారణంగా లోన్ కట్టని వారు బ్యాంకు నుంచి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేయరని.. అందుకే వారికి చెప్పకుండా ఇంటి వెళ్లి కలవడమే ఉత్తమ మార్గమని భావిస్తోంది.

గతేడాదితో పోలిస్తే జూన్ 2023 త్రైమాసికానికి SBI రిటైల్ రుణాల వాటా 16.46 శాతం పెరిగింది. తద్వారా మొత్తం 33 లక్షలకు పైగా ఖాతాదారులు ఈ విభాగంలో ఉన్నారు. వడ్డీరేట్లు, రిటైల్ రుణాలు పెరుగుతుండటంతో.. మెరుగైన వసూళ్లు సాధించేందుకు ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని బ్యాంక్ అంచనా వేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా 15 రోజుల నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
"AI సాంకేతికత ఉపయోగిస్తున్న 2 ఫిన్‌టెక్‌లతో మేము ఓ వినూత్న పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. మా రిటైల్ రుణగ్రహీతలకు వారి రీపేమెంట్ బాధ్యతలను గుర్తుచేసేందుకు ఈ పని చేస్తున్నాం. ఇందులో డీఫాల్ట్‌గా మారే రుణగ్రహీతలను ముందుగా గుర్తించి.. ఈ ఫిన్‌టెక్ ప్రతినిధులు వారిని నేరుగా సందర్శిస్తారు. ప్రతి ఒక్కరికీ చాక్లెట్ల ప్యాక్ ఇచ్చి రాబోయే EMIల గురించి గుర్తుచేస్తారు" అని SBI రిస్క్ ఇన్‌ఛార్జ్ MD అశ్వినీ కుమార్ తివారీ తెలిపారు.


Click it and Unblock the Notifications