దేశంలో రెండో అత్యంత లాభదాయక సంస్థగా SBI.. మొదటి, మూడు స్థానాల్లోని కంపెనీలు ఇవి !
SBI: దేశంలో అత్యంత లాభదాయకమైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అని తెలిసిందే. తర్వాతి స్థానంలో ఉన్నదేంటో తెలుసా? అతిపెద్ద రుణదాతగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. FY23లో రిలయన్స్ తర్వాత అత్యంత లాభదాయక సంస్థగా SBI అవతరించింది. గత మూడేళ్ల ఆదాయాల్లో 41 శాతం వృద్ధిని కనబరచడమే ఇందుకు కారణం.
అధిక నికర వడ్డీ ఆదాయం మరియు తక్కువ ఖర్చుల వల్ల 2022-2023 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 57 శాతం YoY పెరిగి 55 వేల 648 కోట్లకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన Q4 ఫలితాల్లో ఈ మేరకు SBI ప్రకటించింది. ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా మరే ఇతర భారతీయ కంపెనీ లాభాలు 50 వేల కోట్ల మార్కు దాటలేదు.

66 వేల 702 కోట్ల నికర లాభంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అనంతరం 55 వేల 648 కోట్లతో SBI రెండో స్థానంలో నిలిచింది. కాగా 45 వేల 997 కోట్లతో HDFC బ్యాంక్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మే 29న Q4 ఫలితాలు ప్రకటించాల్సి ఉన్న ONGC నికర లాభం 48 వేల కోట్లుగా ఉంటుందని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది.
ఫలితాలపై SBI ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా స్పందించారు. ఆయా సెగ్మెంట్‌లలో బ్యాంకుకు క్రెడిట్ వృద్ధి బలంగా ఉందన్నారు. విదేశీ కార్యాలయాలు మంచి పనితీరును కొనసాగించాయని, సంవత్సరాలుగా ఆస్తుల నాణ్యత మెరుగుపడిందని పేర్కొన్నారు. స్థూల NPA నిష్పత్తి గత 10 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు చెప్పారు. గత త్రైమాసికం నాటికి 3.14 శాతం ఉన్న స్థూల NPA నిష్పత్తి 2023 మార్చి చివరి నాటికి 2.78 శాతానికి తగ్గినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications