77 లక్షల ఉద్యోగాలు..రూ. 75 వేల కోట్ల రెవిన్యూ.. కొత్త లేబర్ కోడ్‌పై SBI సంచలన నివేదిక
భారత ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన కొత్త కార్మిక చట్టాలు దేశ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. ఈ చట్టాలు సమర్థవంతంగా అమలు అయితే.. భారతదేశంలో నిరుద్యోగం సుమారు 1.3 శాతం తగ్గవచ్చని, దీని ఫలితంగా దాదాపు 77 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందవచ్చని SBI అంచనా వేసింది. ప్రస్తుత శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, పని వయస్సు గల జనాభా శాతం ఆధారంగా ఈ అంచనాలు సిద్ధం చేయబడ్డాయి.
ఉపాధి పెరిగితే ప్రజల ఆదాయం సాధారణంగానే పెరుగుతుంది. అదే సమయంలో వినియోగం కూడా పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. SBI గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ విశ్లేషణ ప్రకారం.. ఆదాయం పెరుగుదల దృష్ట్యా ప్రతి వ్యక్తి రోజుకు సుమారు రూ. 66 అదనంగా ఖర్చుచేసే అవకాశం ఉంది. భారతదేశంలో సగటు 30 శాతం పొదుపు రేటును పరిగణనలోకి తీసుకుంటే.. ఈ అదనపు వినియోగం వార్షిక ప్రాతిపదికన రూ. 75 వేల కోట్ల వరకు చేరవచ్చని SBI అంచనా వేసింది. అంటే, కార్మిక చట్టాలు కేవలం ఉద్యోగాలను మాత్రమే సృష్టించవు, దేశ వ్యాప్తంగా వినియోగం, మార్కెట్ డిమాండ్‌ను కూడ పెంచుతాయి.

ఈ కొత్త కార్మిక కోడ్‌లు ఉద్యోగులు, యజమానుల మధ్య సంబంధాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడానికి దోహదపడతాయి. పని ప్రదేశాలలో భద్రత, ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి; ఉద్యోగుల వేతన నిర్మాణం ఇంకా స్పష్టతను పొందుతుంది; వివాదాల పరిష్కారం వేగవంతమవుతుంది. కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత సౌలభ్యంగా నిర్వహించగలుగుతాయి. ఈ మార్పులు భారత కర్మిక వాతావరణాన్ని ఆధునికత వైపు తీసుకెళ్లి, దేశాన్ని మరింత పోటీతత్వంతో కూడిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలవని నిపుణులు భావిస్తున్నారు.
భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 440 మిలియన్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో 310 మిలియన్ల మంది e-SHRAM పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. SBI లెక్కల ప్రకారం.. ఈ అసంఘటిత రంగ కార్మికుల్లో 20 శాతం మంది అధికారిక ఉపాధిలోకి మారితే, దాదాపు 100 మిలియన్ల మంది మెరుగైన ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ, పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను పొందగలరు. ఈ మార్పుల కారణంగా భారతదేశంలో సామాజిక భద్రతా కవరేజ్ 80 శాతం నుండి 85 శాతం వరకు పెరుగుతుందని అంచనా.
నవంబర్ 21 నుంచి అమలులోకి వచ్చిన ఈ నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు ఏంటంటే.. వేతన కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020. ఇవి మునుపటి 29 చట్టాలకు బదులుగా సమగ్ర వ్యవస్థను అందిస్తున్నాయి. కొత్త చట్టాలు ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని మార్చడం మాత్రమే కాదు, పని ప్రపంచాన్ని మరింత సురక్షితంగా, ఉత్పాదకతతో కూడినదిగా, భవిష్యత్తు అవసరాలకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో రూపొందించబడ్డాయి.
క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ కొత్త కార్మిక చట్టాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి పెరుగుదల, వినియోగ వృద్ధి, సామాజిక భద్రత విస్తరణ, ఉత్పాదకత మెరుగుదల లాంటి పలు మార్గాల్లో భారీ బలాన్ని అందించగలవని SBI రీసెర్చ్ స్పష్టం చేసింది. అమలు కచ్చితంగా జరిగితే, ఈ చట్టాలు భారత్‌ను వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక శక్తిగా మరింత ముందుకు నడిపించగలవని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.


Click it and Unblock the Notifications