Reliance: రిలయన్స్‌కు షాకిచ్చిన ప్రభుత్వరంగ సంస్థ.. మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా రికార్డ్
Reliance: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో అత్యంత లాభదాయక కంపెనీగా అందరికీ తెలుసు. అయితే అది గతం. ప్రస్తుతం రిలయన్స్ ను వెనక్కి నెట్టి ఓ ప్రముఖ లిస్టెడ్ ఎంటిటీ దూసుకువచ్చింది. అదికూడా ప్రభుత్వరంగ సంస్థ కావడం ఒకింత దేశానికి గర్వకారణం.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రిలయన్స్ ఎంటర్ ప్రైజెస్ కు గట్టి షాక్ ఇచ్చింది. జూన్ 2023తో ముగిసిన త్రైమాసికిగాను రిలయన్స్ లాభాలను ఓవర్ టేక్ చేసినట్లు ప్రముఖ బ్రోకింగ్ సంస్థ తెలిపింది. 18 వేల 537 కోట్ల నికర లాభాన్ని SBI పోస్ట్ చేయగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్ 16 వేల 11 కోట్లు. అంటే స్టేట్ బ్యాంక్ లాభం 15.8 శాతం ఎక్కువన్నమాట.

సెప్టెంబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు నాలుగు త్రైమాసిక ఫలితాల మొత్తం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 64 వేల 758 కోట్ల నికర లాభాలను నివేదించగా.. ఇదే సమయంలో SBI నికర లాభాలు 3.25 శాతం పెరిగి 66 వేల 860 కోట్లుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇలా జరగడం గత దశాబ్ద కాలంగా ఇదే మొదటిసారని పేర్కొంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల మెరుగైన క్యాపిటలైజేషన్ కోసం మూలధనం ఇన్ఫ్యూషన్ కోసం కేంద్రం పలుమార్లు సహాయం చేసింది. రిటైల్ విభాగంపై దృష్టి పెట్టడంతో PSBలు తమ ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం ఏర్పడింది. ఫలితంగా బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత కీలకమైన నికర వడ్డీ ఆదాయం (NII)లో SBI స్థిరమైన వృద్ధిని కనబరిచింది. వెరసి PSBలకు మంచిరోజులు వచ్చాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications