SBI News: సమాచార హక్కు చట్టం(RTI) కింద ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించింది. ఆర్‌టీఐ కార్యకర్త లోకేష్ బాత్రా మార్చి 13న ఎస్‌బీఐని సంప్రదించి ఆర్‌టీఐ కింద ఎన్నికల బాండ్లపై పూర్తి సమాచారాన్ని కోరిన సంగతి తెలిసిందే.
సమాచార హక్కు చట్టంలోని 8(1)(ఇ), 8(1)(జె)అనే రెండు సెక్షన్లను ఉటంకిస్తూ సమాచారాన్ని అందించడానికి బ్యాంకు నిరాకరించింది. మొదటి క్లాజ్ రికార్డులతో వ్యవహరిస్తుంది, రెండవ క్లాజ్ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయకుండా వ్యవహరిస్తుంది. బుధవారం సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ నుండి వచ్చిన సమాధానం ఏమిటంటే.. "మీరు కోరిన సమాచారంలో కొనుగోలుదారులు, రాజకీయ పార్టీల వివరాలు ఉన్నాయి కాబట్టి వాటిని బహిర్గతం చేయలేము." అని బాత్రాకు సమాచారం ఇవ్వటం జరిగింది.

దీనికి తోడు సుప్రీం కోర్టులో కేసును వాదించేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను బ్యాంకు చెల్లించిన మొత్తం ఫీజు వివరాలను కూడా బాత్రా అడిగారు. దీనికి సైతం బ్యాంక్ నిరాకరించింది. సమాచారం వ్యక్తిగత స్వభావం అని చెప్పారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని అందించడానికి ఎస్‌బీఐ నిరాకరించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని బాత్రా అన్నారు.
రాజకీయ పార్టీలు, దాతల వివరాలతో మార్చి 14న ఎస్‌బీఐ విడుదల చేసిన డేటాను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ప్రతి ఎలక్టోరల్ బాండ్‌కు ప్రత్యేక నంబర్‌తో సహా పూర్తి సమాచారాన్ని అందించనందుకు సుప్రీంకోర్టు మార్చి 15న స్టేట్ బ్యాంక్ యాజమాన్యాన్ని మందలించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మాట్లాడుతూ.. కొనుగోలుదారుల పేర్లు, కొనుగోలు తేదీతో సహా బాండ్ల అన్ని వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించటంతో బ్యాంక్ తలొంచక తప్పలేదు. బాండ్లకు సంబంధించి ఎస్బీఐ సమర్పించిన పూర్తి డేటాను మార్చి 14న ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రచురించింది.


Click it and Unblock the Notifications