భారతదేశంలో అతిపెద్ధ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. తన కోట్లాది మంది కస్టమర్లకు ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. ఆన్‌లైన్‌ఎస్‌బిఐ వెబ్‌సైట్, యోనో లైట్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్న తక్షణ డబ్బు బదిలీ సేవ mCASHను నవంబర్ 30వ తేదీ తర్వాత పూర్తిగా నిలిపివేయనున్నట్లు SBI ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఇకపై వినియోగదారులు ఈ సేవ ద్వారా డబ్బు పంపడం లేదా స్వీకరించడం సాధ్యం కాదు. ఒకప్పుడు చాలామంది ఉపయోగించిన ఈ పాత సేవకు ఇప్పుడు ముగింపు పలుకుతున్నట్లు SBI బ్యాంక్ స్పష్టం చేసింది.
mCASH సేవ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిలో గ్రహీత యొక్క బ్యాంక్ ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ తెలియకపోయినా, కేవలం వారి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామా ఉన్నప్పుడే డబ్బు పంపే వీలుండేది. ఎవరికైనా పంపిన తర్వాత వారికి SMS లేదా ఇమెయిల్ ద్వారా ఒక లింక్, పాస్‌వర్డ్ అందుతుంది. ఆ వివరాలను ఉపయోగించి, వారు స్టేట్ బ్యాంక్ కస్టమర్లు కాకపోయినా, ఏ బ్యాంక్‌లో ఉన్నా సరే, వెంటనే తమ ఖాతాలోకి డబ్బు బదిలీ చేసుకోవచ్చు. ఇలాంటి తక్షణ డబ్బు బదిలీ వ్యవస్థ ఒకప్పుడు ఎంతో ఉపయోగకరమైనది.

అయితే డిజిటల్ చెల్లింపుల ప్రపంచం వేగంగా మారిపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎక్కువగా UPI, IMPS, NEFT, RTGS వంటి ఆధునికమైన, సురక్షితమైన, వేగవంతమైన పద్ధతులను ఉపయోగించడం ప్రారంభించారు. ప్రత్యేకంగా UPI వచ్చిన తర్వాత 24 గంటలు-365 రోజులు వేగంగా, చిన్న మొత్తాలైనా, పెద్ద మొత్తాలైనా క్షణాల్లో బదిలీ చేసే అవకాశాలు పెరిగాయి. చాలా మంది రోజువారీగా Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌లను ఉపయోగించడం వలన mCASH వంటి పాత పద్ధతులకు ఉపయోగం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పాత టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సేవను నిర్వహించడానికి అవసరమైన వనరులు, సర్వర్‌లు మెయింటైన్ చేయడం బ్యాంక్‌కు ప్రయోజనకరం కాదని SBI నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే SBI mCASH సేవను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే బ్యాంక్ కస్టమర్లు ఈ మార్పు వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రస్తుతం డబ్బు పంపడానికి మరెన్నో వేగవంతమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. యుపిఐ ద్వారా వెంటనే డబ్బు పంపే సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల, అదే ఎక్కువగా ప్రజాదరణ పొందింది. అలాగే IMPS ద్వారా 24 గంటలు ఎప్పుడైనా డబ్బు బదిలీ చేయవచ్చు. NEFT పద్ధతి ద్వారా నిర్దిష్ట సమయాల్లో చెల్లింపులు నిర్వహించుకునే అవకాశం ఉంది. పెద్ద మొత్తాల లావాదేవీల కోసం RTGS ఒక విశ్వసనీయమైన పద్ధతి. ఈ అన్ని పద్ధతులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. పూర్తిగా సురక్షితమైనవే.
mCASH సేవను ఉపయోగించే వారు నవంబర్ 30కి ముందుగానే ఈ తాజా ప్రత్యామ్నాయ పద్ధతులకు మారాలని SBI విజ్ఞప్తి చేసింది. డిజిటల్ చెల్లింపుల రంగం రోజురోజుకు ముందుకు సాగుతున్న ఈ సమయంలో, పాత పద్ధతులను పూర్తిగా నిలిపివేసి, కస్టమర్లను ఆధునిక, సురక్షిత సేవల వైపు మళ్లించడం అవసరం అని SBI భావించింది.


Click it and Unblock the Notifications