SBI ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీం, 30,000 మంది ఔట్!! పథకం వివరాలివీ...
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణ పథకం తీసుకు రావాలని నిర్ణయించింది. సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీం ద్వారా మానవ వనరులను, వ్యయాలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 1వ తేదీ నుండి ఫిబ్రవరి చివరి వరకు ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు ఇది అమలులో ఉంటుంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా సీనియర్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇస్తోంది. పాతికేళ్ల సర్వీస్, 55 సంవత్సరాలు నిండిన ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు.

వీఆర్ఎస్ ఎంచుకునే వారికి ఏం వస్తుంది, బ్యాంకుకు ఎంత ఆదా
సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్ 2020 స్కీంకు 25 ఏళ్ల సర్వీస్, 55 సంవత్సరాల వయస్సు కలిగిన ఉద్యోగుల ప్రాతిపదికన చూస్తే 11656 మంది అధికారులు, ఎస్బీఐకి చెందిన 18,625 మంది సిబ్బంది అర్హులు. వీఆర్ఎస్‌ని ఎంచుకున్న వారికి వారి వేతనంలో 50 శాతం ఎక్స్‌గ్రేషియాగా అందిస్తారు. అర్హత కలిగిన ఉద్యోగుల్లో 30 శాతం మంది ఈ కొత్త స్కీంను ఎంచుకుంటే జూలై 2020 నెల వేతనం ప్రకారం బ్యాంకుకు రూ.2,170.85 కోట్లు మేర నికరంగా మిగులుతుంది. ఎస్బీఐ దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. సిబ్బందిని తగ్గించుకొని, ఉత్పాదకతను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నట్లు ఎస్బీఐ ఇదివరకే చెప్పింది.

వీఆర్ఎస్‌కు గడువు, కానీ ఎంచుకునే వారెందరు
వీఆర్ఎస్ తీసుకోవాలనుకుంటే డిసెంబర్ 1వ తేదీ నుండి ఫిబ్రవరి నెల చివరి వరకు అవకాశం ఉంటుంది. గత ఏడాది ఎస్బీహెచ్ సహా 5 అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఏర్పడిన మిగులు ఉద్యోగుల్లో సీనియర్లను వీఆర్ఎస్ ద్వారా పంపించాలని భావిస్తోందని అంటున్నారు. వీఆర్ఎస్ పథకాన్ని ఎంచుకుంటే సీనియర్ ఉద్యోగులకు మిగిలిన సర్వీస్ కాలానికి 18 నెలలకు మించకుండా వారు తీసుకునే వేతనంలో 50 శాతం చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో వీఆర్ఎస్ ఎంచుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఎస్బీఐతో పాటు విలీనమైన బ్యాంకుల సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుంది. మూడు లేదా నాలుగు ప్రమోషన్ అవకాశాలు కోల్పోయిన అధికారులకు ఇది వర్తిస్తుంది.

ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడి ఉద్యోగం కోల్పోవద్దు
ఉద్యోగులు ఎవరు కూడా వీఆర్ఎస్ వైపుకు వెళ్లవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో మంచి ఉద్యోగాలు కోల్పోవద్దని అఖిల భారత ఎస్బీఐ ఉద్యోగుల సంఘం అంటోంది. కెరీర్ చివరి దశలో అర్ధాంతరంగా ఉద్యోగాలు వదులుకోవడం సరికాదంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడి ఉద్యోగులు ఈ వలలో చిక్కుకోవద్దని ఏఐబీఈఏ కార్యదర్శి వెంకటాచలయ్య అన్నారు.


Click it and Unblock the Notifications