SBI కస్టమర్లకు భారీ షాక్.. ఏటీఎం నుండి నగదు తీస్తే ఇక అదనపు బాదుడే!
ఎస్బీఐ (SBI) ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన ఏటీఎం (ATM) లావాదేవీల ఛార్జీలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు SBI కస్టమర్ అయి ఉండి, ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా వాడుతుంటే.. ఈ మార్పులు మీ జేబుపై ప్రభావం చూపనున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఏటీఎం ఛార్జీల పెంపు: ఎంత చెల్లించాలి?
సాధారణంగా బ్యాంకులు నెలకు కొన్ని ఉచిత లావాదేవీలను (Free Transactions) అందిస్తాయి. ఆ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌పై ఛార్జీలు పడతాయి. ఇప్పుడు SBI ఆ ఛార్జీలను ఈ విధంగా పెంచింది..
- నగదు విత్‌డ్రాయల్ (Cash Withdrawal): ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత పరిమితి ముగిసిన తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాయల్‌పై ఇక నుంచి రూ. 23 + GST చెల్లించాలి. గతంలో ఇది రూ. 21 + GST గా ఉండేది.
- నగదు రహిత లావాదేవీలు (Non-Financial Transactions): బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ స్టేట్‌మెంట్ వంటి వాటి కోసం ఇతర ఏటీఎంలను వాడితే ఇకపై రూ. 11 + GST వసూలు చేస్తారు. గతంలో ఇది రూ. 10 గా ఉండేది.
శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఇలా..
ఇప్పటివరకు ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అన్‌లిమిటెడ్ (అపరిమిత) ఉచిత లావాదేవీలు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ సౌకర్యాన్ని బ్యాంక్ రద్దు చేసింది.
- ఇకపై శాలరీ అకౌంట్ ఉన్నవారు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు.
- 10 సార్లు దాటితే, సాధారణ కస్టమర్ల లాగే వీరు కూడా రూ. 23 , రూ. 11 ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత లావాదేవీలు యథాతథం
సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు ఇచ్చే ఉచిత లావాదేవీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. వీరు గతంలో లాగే ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.
ఎవరికి ఈ ఛార్జీలు వర్తించవు?
కొన్ని కేటగిరీల కస్టమర్లకు ఈ పెంపు నుంచి ఉపశమనం లభించింది..
- ఎస్బీఐ ఏటీఎంలు: ఎస్బీఐ డెబిట్ కార్డు ఉన్నవారు SBI సొంత ఏటీఎంలను ఎన్నిసార్లయినా ఉచితంగా వాడుకోవచ్చు. అక్కడ ఎలాంటి ఛార్జీలు ఉండవు.
- కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్: కార్డు లేకుండా ఏటీఎం నుంచి నగదు తీసే (Cardless Cash Withdrawal) సౌకర్యం SBI ఏటీఎంలలో ఎప్పటికీ ఉచితమే.
- BSBD ఖాతాలు: బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు పాత ఛార్జీలే వర్తిస్తాయి.
- కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC): కేసీసీ ఖాతాదారులకు కూడా ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు.
మొత్తంగా ఏటీఎం ఛార్జీల భారం పడకుండా ఉండాలంటే, వీలైనంత వరకు SBI సొంత ఏటీఎంలను వాడటం మంచిది. అలాగే యూపీఐ (UPI) లావాదేవీలను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications