SBI News: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ అంటే దేశంలోని చాలా మంది గ్రామీణుల నుంచి పెద్ద నగరాల్లోని కస్టమర్ల వరకు అందరికీ నమ్మకం ఎక్కువ. అందుకే చాలా మంది తమ ఖాతాలను ఎక్కువగా స్టేట్ బ్యాంక్ లో తెరిచేందుకు ఇష్టపడుతుంటారు.

కస్టమర్ల కోసం..
స్టేట్ బ్యాంక్ తన ఉద్యోగులకు బ్యాంకింగ్ ఉత్పత్తుల విక్రయ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది నిజంగా SBI కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రొడక్టులను కొనాలని కస్టమర్లను ఎట్టిపరిస్థితుల్లో బలవంతం చేయవద్దని స్టేట్ బ్యాంక్ తన ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ..
ఖాతాదారులకు బీమా పథకాలను బలవంతంగా, అన్యాయంగా విక్రయించడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్లను కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకులు, బీమా కంపెనీలపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు పలు ఫిర్యాదులు అందిన తరుణంలో ఈ నోటిఫికేషన్ వెలువడినట్లు తెలుస్తోంది.

ఇబ్బంది ఏమిటంటే..
75 ఏళ్లు పైబడిన వారు, రుణాలు తీసుకోవడానికి వచ్చిన వారికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేయాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు కొనుగోలు చేసిన కస్టమర్లను ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు పెరిగినట్లు తెలిసింది. పాలసీల అమ్మకాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం బ్యాంకు వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని కేంద్ర అవినీతి నిర్మూలన సంఘం కూడా పేర్కొంది.

డిమాండ్ ఆధారంగా..
SBI ఈ ప్రకటన మధ్య తాము డిమాండ్ ఆధారిత విక్రయాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. అయితే ఖాతాదారులను బలవంతంగా పాలసీలను విక్రయించరాదని బ్యాంకు.. జనరల్ మేనేజర్లకు పంపిన సందేశంలో పేర్కొంది. అనేక బ్యాంకులు ఇదే దందాను నడుపుతున్న తరుణంలో చాలా మంది కస్టమర్లు అసౌకర్యానికి గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించింది.


Click it and Unblock the Notifications