మరో షాక్: భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించిన SBI
ప్రపంచవ్యాప్తంగా అత్యంతవేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న భారత్‌కు ఇటీవల రేటింగ్ సంస్థలు షాకిచ్చాయి. పలు దేశీయ, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వృద్ధి రేటు అంచనాను తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా వృద్ధి రేటును తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతానికి మించి నమోదు అయ్యే అవకాశం లేదని పేర్కొంది. గతంలో ఎస్బీఐ 6.1 శాతంగా అంచనా వేసింది.
వాహన సేల్స్ పెరగకపోవడం, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం, పెట్టుబడుల్లో నిరుత్సాహం వంటి అంశాలు వృద్ధికి అడ్డంకిగా మారాయని ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన 3 నెలల్లో వృద్ధి 4.2 శాతానికి పడిపోనున్నదని ఇటీవల అంచనాను విడుదల చేసింది.

తక్కువ ఆటోమొబైల్ అమ్మకాలు, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు క్షీణించడం వంటి కారణాల వల్ల 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్వార్టర్ 1లో 5 శాతంగా ఉన్న వృద్ధి రేటు మరింత తగ్గి 4.2 శాతానికి తగ్గవచ్చునని అంచనా వేసింది.
ఈ సంవత్సరం నిరాశాజనక వృద్ధిని నమోదు చేసుకోనున్నప్పటికీ వచ్చే సంవత్సరం మాత్రం కోలుకుంటుందని తెలిపింది. 2020-21లో వృద్ధిరేటు 6.2% ఉండవచ్చునని తెలిపింది.
కాగా, ఎస్బీఐకి ముందు ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అన్ డెవలప్‌మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా 2019-20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలు తగ్గించాయి.


Click it and Unblock the Notifications