SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మే 1 నుంచి కొత్త రూల్స్.. మీ జేబుకు చిల్లు పడకముందే తెలుసుకోండి!
మీరు యస్బీఐ క్రెడిట్ కార్డు (SBI credit card) వాడుతుంటారా? అయితే ఈ వార్త మీ కోసమే. మే 1వ తేదీ నుండి ఎస్బీఐ కార్డ్ వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన నిబంధనలను మారుస్తోంది. ఈ మార్పులు ప్రధానంగా వార్షిక ఫీజు మినహాయింపు (Annual Fee Waiver), ఆలస్య రుసుము (Late Payment Charges)కు సంబంధించినవి. ఈ కొత్త రూల్స్ వల్ల సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అవేంటో ఒకసారి వివరంగా చూద్దాం.

వార్షిక ఫీజు రివర్సల్ లిమిట్‌లో మార్పులు
మీరు SBI BPCL క్రెడిట్ కార్డ్ వాడుతుంటే, ఇకపై వార్షిక ఫీజును మాఫీ చేసుకోవడం కొంచెం కష్టమే. గతంలో ఏడాదికి రూ. 50,000 ఖర్చు చేస్తే రూ. 499 వార్షిక ఫీజును బ్యాంక్ వెనక్కి ఇచ్చేది (Reversal). కానీ, మే 1 నుండి ఈ పరిమితిని ఏకంగా రూ. 1 లక్షకు పెంచారు. అంటే, మీరు ఏడాదికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తేనే మీకు ఆ ఫీజు వాపస్ వస్తుంది, లేదంటే తప్పనిసరిగా చెల్లించాల్సిందే.
లేట్ పేమెంట్ ఛార్జీల బాదుడు!
క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం కొంచెం ఆలస్యమైనా బ్యాంకులు పెనాల్టీలు వేస్తాయని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీలను SBI మరింత పెంచింది..
- మునుపటి రూల్: బిల్లు రూ. 500 లోపు ఉంటే ఎలాంటి లేట్ ఫీజు ఉండేది కాదు.
- కొత్త రూల్: ఇప్పుడు కేవలం రూ. 100 లోపు బిల్లు ఉంటేనే ఛార్జీలు ఉండవు. రూ. 101 నుండి రూ. 500 మధ్య బకాయి ఉంటే రూ. 100 జరిమానా విధిస్తారు.
- రూ. 500 - రూ. 1000 మధ్య: ఒకవేళ మీ బకాయి రూ. 500 నుండి రూ. 1,000 మధ్య ఉంటే, గతంలో ఉన్న రూ. 400 పెనాల్టీని ఇప్పుడు రూ. 500 కి పెంచారు.
ఒకవేళ మీ బకాయి రూ. 50,000 దాటితే, ఏకంగా రూ. 1,300 లేట్ పేమెంట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అందుకే బిల్లును గడువులోపు కట్టడం చాలా ముఖ్యం.
వరుసగా రెండు నెలలు కట్టకపోతే అదనపు పెనాల్టీ!
ఒకవేళ మీరు వరుసగా రెండు నెలల పాటు కనీస బకాయి (Minimum Amount Due) చెల్లించకపోతే, పైన చెప్పిన ఛార్జీలతో పాటు అదనంగా రూ. 100 పెనాల్టీ పడుతుంది. మీరు బకాయిని పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలా ఈ ఛార్జీలు పడుతూనే ఉంటాయి.
ఎందుకు ఈ మార్పులు?
సాధారణంగా బ్యాంకులు కస్టమర్లలో డిసిప్లిన్ పెంచడానికి , సర్వీస్ ఛార్జీలను అడ్జస్ట్ చేయడానికి ఇలాంటి మార్పులు చేస్తుంటాయి. మే నెల ఆర్థిక సంవత్సరంలో కీలకమైన సమయం కాబట్టి, బ్యాంకింగ్ రంగంలో మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యస్బీఐ క్రెడిట్ కార్డు (SBI credit card) యూజర్లు తమ ఖర్చులను , బిల్లు పేమెంట్లను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు ఆటో-పే (Auto-pay) ఆప్షన్ పెట్టుకోవడం ద్వారా ఈ అదనపు ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు.


Click it and Unblock the Notifications