ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ ఎస్బీఐ కార్డ్స్ పబ్లిక్ ఇష్యూకు సెబి అనుమతించింది. ఈ ఫిబ్రవరిలోనే ఐపీవోకు వస్తుందని భావిస్తున్నారు. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ త్వరలో దీనిని చేపట్టనుందని అంటున్నారు. ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డ్స్ రూ.9,000 కోట్ల నుండి రూ.10,000 కోట్ల మధ్య సమీకరించే అవకాశాలు ఉన్నాయి.
ఫిబ్రవరి నెలాఖరు వరకు ఎస్బీఐ కార్డ్స్ ఐపీవోకు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ప్రస్తుత క్వార్టర్లో ఎస్బీఐ కార్డ్స్ ఐపీవోను చేపట్టే వీలున్నట్లు ఇటీవల వెల్లడించారు. సెబీకి దాఖలు చేసిన వివరాల ప్రకారం ఐపీవోలో భాగంగా 13 కోట్లకు పైగా షేర్లని విక్రయించవచ్చు.

దీంతో పాటు రూ.500 కోట్ల విలువైన అదనపు సెక్యూరిటీల్ని జారీ చేస్తుంది. వీటిలో సుమారు 37,293,371 షేర్లను ఎస్బీఐ, 93,233,427 షేర్లకు పైగా కార్లైల్ గ్రూప్ (సీఏ రోవర్)ను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ కార్డ్స్‌లో మాతృసంస్థ SBIకి 76% వాటా ఉంది. ఫారన్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కార్లైల్ గ్రూప్‌కు 24% వాటా ఉంది. ఇష్యూకి కొటక్ మహీంద్రా కేపిటల్, యాక్సిస్ కేపిటల్ డీఎస్పీ మెరిల్‌లించ్, నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజరీ, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ తదితర సంస్థలు లీడ్ మేనేజర్లుగా ఉన్నారు.
ఎస్బీఐ ప్లాస్టిక్ కార్డ్స్ విభాగం 9.5 మిలియన్ల మంది వరకు కస్టమర్లను కలిగి ఉంది. గత మూడేళ్లలో దేశీయంగా క్రెడిట్ కార్డుల వినియోగం వార్షిక ప్రాతిపదికన దాదాపు 36% చొప్పున పెరిగింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం క్రెడిట్ కార్డ్ ఔట్ స్టాండింగ్ దాదాపు 26% పెరిగినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications