Q4 Results: అంచనాలు మించిన SBI లాభాలు.. సూపర్ డివిడెండ్ ప్రకటన..
SBI Q4 Results: ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో ఎస్బీఐ మార్కెట్ అంచనాలకు మించి పనితీరును కనబరిచింది.
బ్యాంక్ నేడు ప్రకటించిన జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాల ప్రకారం ఏడాది ప్రాతిపదికన నికర లాభం 24 శాతం భారీ పెరుగుదలతో రూ.20,698 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.16,695 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత త్రైమాసికంలో బలమైన రుణ డిమాండ్ భారీ లాభాలను ప్రేరేపించిందని కంపెనీ వెల్లడించింది. వాస్తవానికి అనలిస్టులు కంపెనీ మార్చి త్రైమాసిక నికర లాభం రూ.13,400గా ఉండొచ్చని అంచనా వేశారు.

తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల ప్రకటన సమయంలో ఒక్కో షేరుపై రూ.13.70 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. మార్చి త్రైమాసికంలో బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. స్టేట్ బ్యాంక్ రుణ వృద్ధి మార్చి త్రైమాసికంలో బలంగా ఉంది. కంపెనీ గడచిన 8 త్రైమాసికాల్లో అత్యుత్తమ వృద్ధి రేటును సాధించింది. స్థూల, నికర NPAల మధ్య నిష్పత్తి పరంగా కూడా బ్యాంక్ ఆకట్టుకునే 36-త్రైమాసిక కనిష్టానికి తాకింది.
మార్చి త్రైమాసికంలో ఎస్‌బీఐ వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం కేవలం రూ.92,951 కోట్లుగా ఉంది. అలాగే క్రెడిట్ వృద్ధి సంవత్సరానికి 15.24 శాతంగా ఉంది. దేశీయ అడ్వాన్సులు 16.26 శాతం పెరగగా.. కార్పొరేట్ అడ్వాన్సులు రూ.11 లక్షల కోట్లు, వ్యవసాయ అడ్వాన్సులు రూ.3 లక్షల కోట్లుగా ఉన్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బ్యాంకింగ్ దిగ్గజం తెలిపింది.
మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో బ్యాంక్ మెుత్తం ఆదాయం రూ.1.28 లక్షల కోట్లుగా నమోదైంది. అలాగే నిర్వహణ ఖర్చులు గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.29,732 కోట్ల నుంచి పెరిగి రూ.30,276 కోట్లుగా ఉన్నాయి. నేడు బ్యాంక్ తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎస్బీఐ స్టాక్ 3 శాతం పెరిగి తన 52 వారాల సరికొత్త రికార్డు ధర రూ.839.65ను తాకింది. మార్కెట్ల ముగింపు సమయంలో స్టేట్ బ్యాంక్ షేర్ ధర ఎన్ఎస్ఈలో 1.13% లాభపడి రూ.820వద్ద ట్రేడింగ్ ముగించింది.


Click it and Unblock the Notifications