SBI ఖాతాదారులకు అలర్ట్! వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్? ఇప్పుడే మీ పనులు ముగించుకోండి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అలర్ట్! మీకు బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పని ఉందా? లోన్ కోసం అప్లై చేయాలా? లేదా లాకర్ ఓపెన్ చేయాలా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆ పనులను ముగించుకోవడం మంచిది. ఎందుకంటే మే 23, 2026 నుంచి మే 28 వరకు, అంటే దాదాపు 6 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచ్‌లు మూతపడే అవకాశం ఉంది. వీకెండ్ సెలవులు, ఉద్యోగుల సమ్మె , బక్రీద్ పండుగ సెలవుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఈ సుదీర్ఘ సెలవుల వల్ల సామాన్య కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

ఈ 6 రోజులు బ్యాంకులు ఎందుకు మూతపడతాయి?
బ్యాంకు సెలవుల (bank holiday) వివరాలు రోజువారీగా చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది..
- మే 23 (నాల్గో శనివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఇది అధికారికంగా సెలవు దినం.
- మే 24 (ఆదివారం): ఎప్పటిలాగే జనరల్ వీకెండ్ హాలిడే.
- మే 25 & 26 (సోమ, మంగళవారాలు): ఈ రెండు రోజులు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
- మే 27 & 28 (బుధ, గురువారాలు): బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం సెలవులు ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మే 27న, మరికొన్ని ప్రాంతాల్లో మే 28న సెలవు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్‌లో అయితే ఈ రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు.
అసలు ఎస్బీఐ ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారు?
ఈ సమ్మెకు ప్రధాన కారణం బ్యాంకు యాజమాన్యం అనుసరిస్తున్న కొన్ని విధానాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉండటమే. వారు ప్రధానంగా 16 డిమాండ్లతో ఈ సమ్మెకు దిగుతున్నారు. అందులో ముఖ్యమైనవి ఇవే..
- అవుట్‌సోర్సింగ్ విధానం: శాశ్వత ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్ చేయడం వల్ల గ్రామీణ యువత, వెనుకబడిన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోతున్నాయని, దీనివల్ల కస్టమర్ల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
- సెక్యూరిటీ గార్డుల కొరత: రిటైర్మెంట్లు అవుతున్నా కొత్తగా ఆర్మ్‌డ్ గార్డులను రిక్రూట్ చేయడం లేదు. దీనివల్ల బ్యాంక్ ఆస్తులకు, సిబ్బందికి, కస్టమర్లకు రక్షణ కరువైందని వారు గుర్తు చేస్తున్నారు.
- NPS ఫండ్ మేనేజర్ ఆప్షన్: ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లాగే ఎస్బీఐ ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద తమకు నచ్చిన పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
డిజిటల్ సేవలు పనిచేస్తాయా?
ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంక్ బ్రాంచ్‌లు మూతపడినప్పటికీ.. ఎస్బీఐ ఆన్‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో (YONO) యాప్, యూపీఐ (UPI) లావాదేవీలు , ఏటీఎం (ATM) సేవలు ఎప్పటిలాగే సాధారణంగా పనిచేస్తాయి. కేవలం ఫిజికల్ బ్యాంకింగ్ పనులకు మాత్రమే అంతరాయం కలుగుతుంది. కాబట్టి నగదు కొరత రాకుండా ముందే కొంత క్యాష్ దగ్గర ఉంచుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications