gold: గోల్డ్ మార్కెట్‌లో ప్రకంపనలు! సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి! ఎంతంటే..
ప్రపంచవ్యాప్తంగా చమురు (Oil) సంపదకు పెట్టింది పేరు సౌదీ అరేబియా. అయితే ఇప్పుడు ఆ దేశం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. సౌదీ అరేబియాలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో కళ్లు చెదిరే స్థాయిలో బంగారు నిక్షేపాలు (gold mines) ఉన్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సుమారు 78 లక్షల ఔన్సుల పసిడి నిక్షేపాలు కొత్తగా కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మైనింగ్ సంస్థ 'మాడెన్' (Maaden) వెల్లడించింది.

ఎక్కడెక్కడ ఈ బంగారు నిధులు ఉన్నాయి?
మాడెన్ సంస్థ చేపట్టిన విస్తృతమైన డ్రిల్లింగ్, అన్వేషణలో ఈ భారీ నిధులు వెలుగు చూశాయి. ముఖ్యంగా నాలుగు ప్రాంతాల్లో ఈ బంగారం ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది..
- మన్సౌరా మస్సారా (Mansourah Massarah): ఇక్కడే అత్యధికంగా 30 లక్షల ఔన్సుల అదనపు నిక్షేపాలు బయటపడ్డాయి.
- వాడి అల్ జౌ (Wadi Al Jaww): ఈ కొత్త ప్రాంతంలో సుమారు 38 లక్షల ఔన్సుల బంగారం ఉండవచ్చని అంచనా.
- ఉరుక్, ఉమ్ అస్ సలాం: ఈ రెండు ప్రాంతాల నుంచి కలిపి మరో 16.7 లక్షల ఔన్సుల పసిడి లభించింది.
ఈ ఆవిష్కరణలతో సౌదీ అరేబియాలోని అరేబియన్ షీల్డ్ (Arabian Shield) ప్రాంతంలో ఇంకా అపారమైన ఖనిజ సంపద దాగి ఉందని స్పష్టమవుతోంది.
బంగారమే కాదు.. రాగి, నికెల్ కూడా!
సౌదీ అరేబియా కేవలం బంగారు నిధుల (gold mines) తోనే ఆగడం లేదు. జబల్ షైబాన్, జబల్ అల్ వకీల్ వంటి ప్రాంతాల్లో జరిపిన డ్రిల్లింగ్‌లో భారీగా రాగి (Copper), నికెల్ (Nickel), ప్లాటినం వంటి విలువైన లోహాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల సౌదీ అరేబియా కేవలం చమురుపైనే కాకుండా, మైనింగ్ రంగం ద్వారా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకోనుంది.
ఆర్ధిక వ్యవస్థలో పెను మార్పులు!
సౌదీ క్రౌన్ ప్రిన్స్ విజన్ 2030 (Vision 2030) లో భాగంగా మైనింగ్ రంగాన్ని దేశ మూడో పిల్లర్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ తాజా ఆవిష్కరణలు ఆ దేశ ఆదాయాన్ని భారీగా పెంచడమే కాకుండా ప్రపంచ పసిడి మార్కెట్‌లో సౌదీ అరేబియా పాత్రను మరింత కీలకం చేయనున్నాయి. మాడెన్ సీఈఓ బాబ్ విల్ట్ మాట్లాడుతూ.. "ఈ ఫలితాలు మా దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. సౌదీలో మరిన్ని బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి మేము భారీగా పెట్టుబడులు పెడుతూనే ఉంటాం" అని ధీమా వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా సౌదీలో అతి పెద్ద బంగారు గనులు దొరకడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మన్సౌరా మస్సారా గనిలో ఉన్న మొత్తం బంగారు నిల్వల విలువ 1.04 కోట్ల ఔన్సులకు చేరుకుంది. 2026 నాటికి మరిన్ని డ్రిల్లింగ్ పనులు చేపట్టడం ద్వారా ఈ నిల్వలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications