Oil Prices: ప్రపంచ దేశాలకు OPEC+ సడన్ షాక్.. వాహనదారులకు మళ్లీ బాదుడు తప్పదా..??
Crude Production Cut: సౌదీ అరేబియాతో పాటు ఇతర OPEC+ చమురు ఉత్పత్తిదారులు సడన్ షాక్ ఇచ్చారు. తమ రోజువారీ చమురు ఉత్పత్తిని తగ్గించాలని హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రతి రోజు 11 లక్షల 60 వేల బ్యారెళ్లను తక్కువగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. దీంతో భారత దిగుమతులు మరింత ప్రియం కానున్నాయి.
OPEC+ దేశాలు తీసుకున్న నిర్ణయం కారణంగా మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు దాదాపు 10 డాలర్ల వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈరోజు ఇప్పటికే బ్యారెల్ కు చమురు ధర 5 డాలర్ల వరకు పెరిగింది. అయితే 2023 చివరి వరకు ఇప్పటికే 20 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి కోతకు వారు కట్టుబడి ఉండనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.

ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా డిమాండ్ దెబ్బతినటంతో చమురు ధరలు ఆందోళనకర స్థాయిలకు పడిపోయి 70 డాలర్లకు చేరుకుంది. ఇది దాదాపు 15 నెలల కనిష్ఠ ధర. ఆ తర్వాత కొంత కోలుకున్న క్రూడా ధరలు 80 డాలర్లకు చేరుకున్నాయి. చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా కొనసాగుతున్న సౌదీ తన ఉత్పత్తిని రోజుకు 5 లక్షల బ్యారెళ్ల మేర తగ్గించాలని నిర్ణయించినట్లు తాజాగా వెల్లడించింది. ఈ చర్యపై స్పందించిన అమెరికా OPEC+ తీసుకున్న తాజా నిర్ణయం అవాంఛనీయమైనదని పేర్కొంది.
తాజా చర్యలు పెట్రోలియం ఉత్పత్తులు, చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఉత్పత్తి కుదింపు చర్యలు ధరల పెరగటానికి కారణమౌతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కుస్తీలు పడుతుండగా.. చమురు ధరల పెరుగుదల వస్తువులు, ఉత్పత్తుల, ముడిసరుకుల రేట్లను పెంచటానికి కారణమౌతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు ఇప్పటికే ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులపై పెరిగిన చమురు ధరలు మరో పిడుగులా మారనున్నాయి. దేశీయ చమురు సంస్థలు సైతం త్వరలోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మెుత్తానికి సామాన్య వినియోగదారులపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఈ నిర్ణయం ప్రభావాన్ని చూపనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications