AI New: భారత్‌ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు మోదీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. కరోనా విజృంభణ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంతర్జాతీయ సంక్షోభాలను కూడా తట్టుకుని ముందుకు సాగుతోంది. ఈ సమయంలో సత్య నాదెళ్ల కీలక సూచనలు చేశారు.
ముంబైలో ఓ కీలక ఉపన్యాసం సందర్భంగా భారత్ వృద్ధి పట్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక సూచనలు చేశారు. ఇండియా ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రముఖ పాత్ర పోషిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ సొంత AI టూల్ కోపైలెట్ సహా వివిధ ఆర్టిఫిషియల్ సాధనాల ద్వారా భారతీయ సంస్థలు భారీగా ప్రయోజనం పొందుతున్నట్లు వివరించారు.

'ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సాంకేతికత నిజమైన ప్రభావాన్ని చూపుతున్నట్లయితేనే దాని గురించి మాట్లాడగలం. ఖచ్చితంగా నేడు ఇది భారీ వృద్ధికి ఆస్కారమున్న మార్కెట్. కొందరు దాన్ని తేలికగా చూడవచ్చు. కానీ 2025 నాటికి ఎంతమేర వృద్ధి సాధించగలం, అందులో AI వాటా ఎలా ఉంటుంది అనే విషయాలపై ప్రభుత్వం సహా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు' అని నాదెళ్ల పేర్కొన్నారు.
ఎకానమీ డెవలప్‌మెంట్ లో AI సామర్థ్యాన్ని, భవిష్యత్ వృద్ధి కోసం సాంకేతికతలో పెట్టుబడి పెట్టాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. 2025 నాటికి దేశ GDP 500 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేయబడినందున, AI ఆధారిత ఆర్థిక వృద్ధిలో ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు.
'నైపుణాభివృద్ది గురించి ఓ కొత్త ప్రకటన చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. భారతదేశంలో దాదాపు 2 మిలియన్ల కంటే ఎక్కువ మందిని AI నైపుణ్యాలతో సన్నద్ధం చేయబోతున్నాము. ఇది కేవలం స్కిల్ డెవలప్‌మెంట్ మాత్రమే కాదు, ఈ ఇనీషియేటివ్ ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి' అని మైక్రోసాఫ్ట్ CEO వెల్లడించారు.


Click it and Unblock the Notifications