అమెరికాలో కోడి పందాల హడావుడి..! టోనోపాలో ముగ్గురు అరెస్ట్, అసలు కథ ఇదీ!
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడికి 'సంక్రాంతి' అంటే అదో ఎమోషన్. కొత్త బట్టలు, పిండి వంటలు ఎలాగో.. ఆంధ్రాలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 'కోడి పందాలు' (Cockfighting) కూడా అంతే ఫేమస్. అయితే తాజాగా అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన చూస్తుంటే.. ఈ పందాల మోజు ఖండంతరాలు దాటినట్లు కనిపిస్తోంది.
టోనోపాలో ఏం జరిగింది?
అరిజోనాలోని టోనోపా (Tonopah) సమీపంలో అక్రమంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మారిపోకా కౌంటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. విశేషమేమిటంటే, అక్కడ ఏకంగా 34 బతికున్న పందెం కోళ్లు, కొన్ని చనిపోయిన కోళ్లు, అలాగే పందాల కోసం వాడే కత్తులు, జూదం లెక్కలు దొరికాయి. అమెరికా చట్టాల ప్రకారం ఇది తీవ్రమైన నేరం . మన దగ్గర సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇవి చూస్తూ ఉంటాం. కానీ, అమెరికాలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం స్థానిక పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది.

ఆంధ్రా 'సంక్రాంతి' కి దీనికి లింక్ ఏంటి?
మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంక్రాంతి (Sankranti) వచ్చిందంటే చాలు.. కోడి పుంజుల గర్జనలు వినపడాల్సిందే. కుక్కుట శాస్త్రం ప్రకారం ఏ రంగు కోడి ఏ సమయంలో గెలుస్తుందో లెక్కలేసి మరీ పందాలు కాస్తారు. అయితే, అమెరికాలోని టోనోపా వంటి ప్రాంతాల్లో కూడా సరిగ్గా ఇదే సమయంలో ఇలాంటి కార్యకలాపాలు వెలుగు చూడటం.. మన సంక్రాంతి పండగ సీజన్‌తో ముడిపడి ఉందా అనే చర్చకు దారితీస్తోంది.
మనవాళ్లు కాదు..
అమెరికాలో కోడి పందాలు అనగానే చాలామంది మన తెలుగువాళ్లే అక్కడ కోడి పందాలు వేస్తున్నారేమో అనుకుంటారు. అయితే అసలు విషయం అది కాదు. మెక్సికన్లకు కూడా ఇలా కోడి పందాల అలవాటు ఉంది. రీసెంట్ గా పట్టుబడింది కూడా మెక్సికన్లే. మెక్సికోలో కోడి పందాలు లీగల్ కూడా. కానీ, అమెరికాలో ఇలాంటివి ఇల్లీగల్. అందుకే వారిని అరెస్ట్ చేశారు.
టెక్నాలజీ vs సంప్రదాయం
టోనోపాలో పోలీసులు ఈ ముఠాను పట్టుకోవడానికి డ్రోన్లు, ఏఐ కెమెరాలను ఉపయోగించారు. ఇక్కడ మన ఏపీలో కూడా పోలీసులు కోడి పందాలను అడ్డుకోవడానికి డ్రోన్ల నిఘా పెంచుతున్నారు. కానీ, కోడి పందెం అంటే కేవలం జూదం మాత్రమే కాదు, అది ఒక వీర క్రీడ అని నమ్మే పందెం రాయుళ్లు పోలీసుల కళ్లు గప్పి మరీ బరులను సిద్ధం చేస్తున్నారు.
రూ. కోట్ల వ్యాపారం.. వేల మంది ఉత్సాహం
ఆంధ్రాలో సంక్రాంతి మూడు రోజుల్లో కోడి పందాల ద్వారా జరిగే టర్నోవర్ కొన్ని వందల కోట్లలో ఉంటుంది. కేవలం కోళ్లకే కాదు, వాటికి కట్టే చిన్న కత్తుల తయారీ కూడా ఒక పెద్ద కుటీర పరిశ్రమలా మారిపోయింది.
చట్టం దృష్టిలో ఏదైనా ఒకటే!
టోనోపాలో అరెస్టయిన ముగ్గురికి జైలు శిక్ష ఖాయమని తెలుస్తోంది. అలాగే మన దగ్గర కూడా సంక్రాంతి (Sankranti) సందర్భంగా కోడి పందాలు ఆడటంపై హైకోర్టు తీవ్రమైన ఆంక్షలు విధించింది. సంప్రదాయం పేరుతో జూదానికి పాల్పడితే శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. పండగంటే ఆనందం ఉండాలి. కానీ, ఇలా చట్టపరమైన ఇబ్బందుల్లో పడకూడదు కదా!


Click it and Unblock the Notifications