DSP Bheem Reddy: కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు.. రూ.300 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన భీంరెడ్డి..!
ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఏసీబీ సోదాలు పెరుగుతున్నాయి. ఈ సోదాల్లో పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి. తాజాగా పోలీస్ శాఖకు చెందిన భారీ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ పట్టుకుంది. డీఎస్పీ స్థాయి అధికారి అక్రమంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారు. అతని అక్రమాస్తులు లెక్క కట్టేందుకు అధికారులకు ఒక రోజు సరిపోలేదు. గురు, శుక్రవారం సోదాలు చేసి అవినీతి సొమ్మును బయట పెట్టాయి. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డి లంచాల రూపంలో భారీగా ఆస్తులు కూడగట్టాడు.
విషయం తెలుసుకున్న అవినీతి నిరోధక శాఖ భీం రెడ్డికి సంబంధించిన ఇళ్లు, బంధువుల ఇళ్లలో గురువారం ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేసింది. సోదాల్లో భారీ ఆస్తులు బయటపడ్డాయి. భీం రెడ్డి 1989లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరాడు. ఆయన 1995లో ఎస్సైగా ప్రమోషన్ పొందారు. ఎస్సై అయినప్పటి నుంచి భీం రెడ్డీ లంచాలకు రుచిమరిగారని చెబుతున్నారు. ఇక 2010లో సీఐ ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్రమ సంపాదన మరింత పెరిగింది. తన వద్దకు వచ్చే ఎవరిని కూడా వదలకుండా భీంరెడ్డి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తన సర్వీస్ లో హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లోనే విధులు నిర్వహించిన ఆయన భారీగా వెనకేసుకున్నారు.

విధులు నిర్వహించిన ప్రతి ప్రాంతాలంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట వ్యాపారులను బెదిరించి ప్లాట్లను తమ బంధువులు, స్నేహితుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. విచిత్రం ఏమిటంటే.. ఆయన పేరుపై ఒక్క చర ఆస్తి కూడా లేదు. అన్నీ బినామీల పేరు మీదే ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పది మంది బినామీల పేరుతో కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. భీమ్‌రెడ్డికి.. బీజేపీ నేత, మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మన్ కే నరేందర్‌రెడ్డితో వ్యాపార సంబంధం ఉన్నదని ఏసీబీ పేర్కొంది. దీంతో నరేందర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు.
ఆయన విచారణ తర్వాత మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. భీంరెడ్డి, నరేందర్ రెడ్డి మరికొందరు కలిసి బెంగళూరు, కర్ణాటకల్లో భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారరు. రెండేండ్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నా.. ఆయన పేరున ఆస్తులు ఉన్నట్టు సరైన ఆధారాలు లేక ఏసీబీ ఇన్ని రోజులు వేచి చూసినట్లు తెలుస్తోంది. భీంరెడ్డి ఆస్తుల విషయానికొస్తే.. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా, టెలికాంనగర్‌లో జీ+2 +పెంట్ హౌస్ గల నివాస భవనం, టెలికాం నగర్‌లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్,
గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్, మణికొండ లాంకో హిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల జీ+5 వాణిజ్య సముదాయంలో వాటా, మణికొండ మర్రిచెట్టు జంక్షన్‌లో 3వేల చదరపు అడుగుల వాణిజ్య స్థలం, తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ వద్ద 500 చదరపు గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో ఆరెకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలోనే మరో 38 ఎకరాల వ్యవసాయ భూమి, దేవనహళ్లిలో ఎకరం భూమి, నాగోల్‌లో కామినేని దవాఖాన సమీపంలో 200 చదరపు గజాల స్థలం ఉంది.
అంతేకాకుండా పటాన్‌చెరులో జీపీఆర్ హౌసింగ్ సొసైటీ వద్ద 400 చదరపు గజాల స్థలం, పటాన్‌చెరులో 200 చదరపు గజాల మరో స్థలం, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 1,000 చదరపు గజాల భూమి, మోమిన్‌పేటలో 2 ఎకరాల వ్యవసాయ భూమి, రాఘవేంద్ర రాక్‌సాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి, రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంట్లో రూ.3.60 లక్షల నగదు, ఆయన బినామీ నివాసంలో రూ.40 లక్షల నగదు, దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు, సుమారు 20 కిలోల వెండి వస్తువులు, దాదాపు రూ.19.91 లక్షల బ్యాంకు నిల్వలు గుర్తించారు.


Click it and Unblock the Notifications