OpenAI: గడచిన కొన్ని రోజులుగా చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐలో ఒక అంతర్ యుద్ధం కొనసాగుతోంది. బోర్డు నిర్ణయంతో సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ కంపెనీ నుంచి బయటకు రావటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ప్రస్తుతం మారిన పరిణామాల ప్రకారం సామ్ ఆల్ట్‌మాన్ కొత్త బోర్డు సభ్యులతో సీఈవోగా కంపెనీకి తిరిగి వస్తారని ఓపెన్ ఏఐ వల్లడించింది. ఇందులో బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలో సభ్యులుగా ఉంటారని వెల్లడైంది. దీనికి సంబంధించి సూత్ర ప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓపెన్ ఏఐ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల సామ్ తొలగింపుపై ఏకంగా ఉద్యోగులు సైతం బోర్డుకు లేఖ రాయటంతో పరిస్థితులు చేజారకముందరే కంపెనీ కళ్లు తెరిచినట్లు తాజా పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది.

సామ్ ఆల్ట్‌మాన్ కూడా తాను OpenAIకి తిరిగి వస్తానని అధికారికంగా ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా నేను చేసిన ప్రతిదీ బృందాన్ని, దాని మిషన్‌ను కలిసి ఉంచడానికి దోహదపడిందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తాను మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరాలని నిర్ణయించుకున్నానని.. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అందించిన మద్దతుతో కొత్త బోర్డు సభ్యులతో కూడిన ఓపెన్ ఏఐకి తిరిగి వస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే Microsoftతో తమ బలమైన భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ పరిణామాలపై మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల స్పందించారు. OpenAI బోర్డులో చేసిన మార్పులను ప్రశంశించారు. ఇది మరింత స్థిరమైన, సుపరిచితమైన, సమర్థవంతమైన పాలనకు మార్గంలో మొదటి ముఖ్యమైన దశగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. సామ్, గ్రెగ్ లతో తాను మాట్లాడానని వారు కంపెనీ మిషన్ నిర్మాణాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషించేందుకు వారు అంగీకరించారని తెలిపారు.


Click it and Unblock the Notifications