మరో భారీ లేఆఫ్స్‌కు సిద్ధమౌతున్న టెక్ దిగ్గజం.. వచ్చే ఏడాదీ ఊచకోతకు విరామం లేనట్లే!
layoffs: ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట లేఆఫ్స్ వార్తలు వినాల్సి వస్తోంది. ఉన్న ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎవరిపై లేఆఫ్స్ వేటు పడుతుందోనని ఉద్యోగుల్లో ముఖ్యంగా టెక్కీల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరో టెక్ దిగ్గజం భారీగా తన సిబ్బందికి ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన శ్రామిక శక్తిలో 10 శాతాన్ని తొలగించనున్నట్లు ప్రముఖ దిగ్గజ సంస్థ సేల్స్ ఫోర్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం 7 వేల మందిపై ప్రభావం చూపింది. ఇందుకు అదనంగా 2 గంటల సుదీర్ఘ వీడియో కాల్ అనంతరం తాజాగా 50 మంది సేల్స్, కస్టమర్ సక్సెస్ టీమ్ ఉద్యోగులపై వేటు వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అయితే ఈ లేఆఫ్స్ ఇక్కడితో ఆగవని తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 8 వేల మందికి ఉద్వాసన పలకాలని సేల్స్ ఫోర్స్ భావిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. అయితే ఈ తొలగింపులు కేవలం USలోనా లేదా ఇతర దేశాలకూ విస్తరిస్తాయా అన్న ప్రశ్నకు మాత్రం కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు.
గతంలో తొలగించిన వారికి కంపెనీ మంచి సపరేషన్ ప్యాకేజీని అందించి మద్ధతిచ్చినట్లు ఇండస్ట్రీ నిపుణులు గుర్తుచేస్తున్నారు. USలో లేఆఫ్స్ బాధితులకు దాదాపు 5 నెలల జీతం, ఆరోగ్య బీమా సహా కెరీర్ బిల్డ్ అప్ కోసం ఇతర ప్రయోజనాలు అందించింది. కాగా భవిష్యత్తులోనూ ఆయా దేశాల్లోని స్థానిక చట్టాలకు అనుగుణంగా మంచి ప్యాకేజీతో ఉద్యోగులను సేల్స్ ఫోర్స్ సాగనంపుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications