బంగారం, వెండి ధరల పతనం.. ఇప్పుడే వీలైనంత ఎక్కువ కొనుగోలు చేసి పెట్టుకోవాలని కియోసాకి కీలక సూచన..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు ప్రస్తుతం విలువైన లోహాల్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.. ఇలాంటి సమయంలో, ప్రముఖ ఆర్థిక నిపుణులు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. బంగారం, వెండి వంటి లోహాల ధరలు ఒక్కసారిగా పడిపోతున్న నేపథ్యంలో.. చాలామంది పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే కియోసాకి మాత్రం దీనిని క్రాష్ గా కాకుండా కొనుగోలు చేసే అరుదైన అవకాశం గా అభివర్ణించారు.
ఇటీవలి అమ్మకాలపై స్పందిస్తూ.. సాధారణ వినియోగదారుల ప్రవర్తనతో పెట్టుబడిదారుల మనస్తత్వాన్ని పోలుస్తూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం Xలో చేసిన పోస్ట్‌లో, వాల్‌మార్ట్‌లో డిస్కౌంట్ వచ్చినప్పుడు పేదలు కొనుగోలు కోసం పరుగెత్తుతారు. కానీ అదే ఆస్తి మార్కెట్లలో అమ్మకాలు వచ్చినప్పుడు భయంతో అమ్మేస్తారు. నిజమైన ధనవంతులు మాత్రం అలాంటి వేళల్లోనే లోపలికి వచ్చి కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మార్కెట్‌లో భయాందోళనల మధ్య ఉన్న పెట్టుబడిదారులకు ఒక భిన్న దృక్పథాన్ని అందిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు సేల్‌లో ఉన్నాయని Robert Kiyosaki అభిప్రాయపడ్డారు. తాను మరిన్ని కొనుగోలు చేయడానికి నగదుతో సిద్ధంగా ఉన్నానని కూడా వెల్లడించారు. మార్కెట్‌లో వచ్చే తీవ్రమైన కరెక్షన్లను నష్ట సంకేతాలుగా కాకుండా.. దీర్ఘకాలిక సంపద నిర్మాణానికి అవకాశాలుగా చూడాలని ఆయన ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు.
ప్రత్యేకంగా వెండిపై కియోసాకికి గట్టి నమ్మకం ఉంది. వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాకుండా, ఒక కీలక పారిశ్రామిక లోహంగా కూడా ఉపయోగపడుతుంది. సౌర విద్యుత్ ఫలకాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య పరికరాలు, రక్షణ రంగ సాంకేతికతలలో వెండికి విస్తృతమైన వినియోగం ఉంది. ఈ రంగాలన్నీ భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉండటంతో, వెండి డిమాండ్ దీర్ఘకాలంలో పెరుగుతుందని ఆయన విశ్వసిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వ రుణాలు పెరుగుతుండటం, ఫెడరల్ రిజర్వ్, ట్రెజరీ తీసుకుంటున్న ద్రవ్య విధాన నిర్ణయాలు కూడా తన పెట్టుబడి వ్యూహానికి కారణమని కియోసాకి పలుమార్లు చెప్పారు. కరెన్సీల విలువ తగ్గే ప్రమాదం ఉన్నప్పుడు, బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే రక్షణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయం.
ప్రస్తుతం మార్కెట్ గణాంకాలు కూడా తీవ్ర కరెక్షన్‌ను సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకు సుమారు 7-8 శాతం పడిపోగా, వెండి దాదాపు 14 శాతం తగ్గింది. దేశీయంగా MCXలో గోల్డ్ ఫ్యూచర్స్ గణనీయంగా పడిపోగా.. వెండి ధరలు మరింత తీవ్రంగా క్షీణించాయి. బంగారం తన ఆల్‌టైమ్ హై నుంచి దాదాపు పావు వంతు తగ్గగా.. వెండి దాని చరిత్రలోనే అత్యంత పెద్ద పతనాల్లో ఒకదాన్ని చూసింది.
ఇలాంటి పరిస్థితుల్లో భయంతో అమ్మకం కాకుండా, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించాల్సిన సమయమిదేనని కియోసాకి అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ ఒడిదుడుకులు తాత్కాలికమైనవే అయినా, అవకాశాలను గుర్తించగలిగినవారే నిజమైన లాభదాయక పెట్టుబడిదారులవుతారని ఆయన స్పష్టం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications