IPO News: నెలాఖరున ప్రారంభమౌతున్న ఐపీవో.. లేటు చేయకుండా క్యాష్ రెడీ చేసుకోండి..
Sai Swami Metals IPO: ఏప్రిల్ నెల దాదాపు చివరికి వచ్చేసింది. ఈ నెలలో వాస్తవానికి మార్కెట్లు భారీగా ఒడిదుడుకులకు లోనైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా తక్కువ సంఖ్యలోనే ఈ నెలలో ఐపీవోలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే వచ్చిన వాటిలో అధికశాతం ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తుల తయారీ సంస్థ సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లాయ్స్ లిమిటెడ్ గురించే. ఈ కంపెనీ తన ఐపీవోను ఏప్రిల్ 30న ప్రారంభించనుంది. తన ఐపీవో ద్వారా క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.15 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఐపీవో ఇష్యూ మే 3న ముగుస్తుందని కంపెనీ శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ అవనున్నాయి.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ డాల్ఫిన్ బ్రాండ్ పేరుపై స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులను కంపెనీ తయారుచేస్తోంది. ఐపీవో కోసం కంపెనీ తన ఈక్విటీ షేర్ ఇష్యూ గరిష్ఠ ధరను రూ.60గా నిర్ణయించింది. ఇందుకోసం ఐపీవోలో కంపెనీ 25 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. తాజా ఐపీవో ద్వారా వచ్చిన డబ్బును కంపెనీ మెషినరీ కొనుగోలు, అనుబంధ సంస్థలో పెట్టుబడి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలతో సహా కంపెనీ విస్తరణ ప్రణాళికలకు నిధులు సమకూరుస్తుందని సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లాయ్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది.
కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ.6 కోట్లు, అనుబంధ సంస్థలో పెట్టుబడికి రూ.4 కోట్లు, యంత్రాల కొనుగోలుకు రూ.2 కోట్లు, సాధారణ కార్పొరేట్ పర్పస్ కోసం రూ.2 కోట్లు వినియోగించాలని నిర్ణయించింది. డిసెంబర్ 2023తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ లాభం రూ.1.79 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.33.33 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.3.83 లక్షల లాభాన్ని, రూ.6.27 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications