China-Russia: చైనా ఉచ్చులో చిక్కిన రష్యా..! ఈ స్కెచ్ పుతిన్ పతనానికేనా..??
China-Russia: గత ఏడాది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తలకిందులైన సంగతి తెలిసిందే. రోజులు గడిచే కొద్ది సమస్య కొలిక్కి రావాల్సింది పోగా.. మరిన్ని ఆర్థిక ఇబ్బందులకు కారణంగా మారుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా వాణిజ్యం, ఆర్థిక పరిస్థితులు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి. ఒకవైపు యుద్ధానికి విపరీతమైన ఖర్చు అవుతుంటే.. పుతిన్ ప్రభుత్వం మరోపక్క దేశ ఆర్థికాభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే ఇదే సమయంలో పాశ్చాత్య దేశాల ఆంక్షలు రష్యా వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో పాశ్చాత్య రుణదాతలు దేశం విడిచి వెళ్లిపోయాయి.

ప్రస్తుతం ఈ పరిస్థితులు చైనాకు అనుకూలంగా మారాయి. అవును చైనాలోని అతిపెద్ద బ్యాంకులు ప్రస్తుతం రష్యాకు బిలియన్ల కొద్దీ డాలర్లను సమకూర్చి పెడుతున్నాయని వార్తలు బయటకొచ్చాయి. ఒక విధంగా పుతిన్ ప్రభుత్వం చైనా రుణ ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కైవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యయనం ప్రకారం.. యుద్ధం తర్వాత చైనాలోని నాలుగు అతిపెద్ద బ్యాంకుల ఎక్స్‌పోజర్ రష్యా బ్యాంకింగ్ రంగానికి నాలుగు రెట్ల మేర పెరిగింది.
చైనాకు చెందిన బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, ఇండస్ట్రియల్ & కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ కార్పొరేషన్, అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ రష్యాకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ.. దాదాపు 14 నెలల్లో రష్యాకు చైనా 7.8 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది.
చైనా తన క్రెడిట్ నెట్‌వర్క్ ద్వారా వాణిజ్య పరంగా వెనుకబడిన దేశాల్లో ఇన్వెస్ట్ చేసి తాను శక్తివంతుడిగా మారుతుందని మనందరికీ తెలిసిందే. ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు అనేక ఆఫ్రికా దేశాల్లో ఇదే వ్యూహాన్ని చైనా అమలు చేసింది. అయితే ప్రస్తుతం రష్యా సైతం ఈ లిస్టులో చేరిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే చైనాకు చెందిన ముడి చమురు రష్యా వద్ద ఉన్నందున చైనా క్రెడిట్ నెట్‌వర్క్ వ్యూహం రష్యాలో పనిచేయదని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications