Rupee Payments: రూపీ చెల్లింపులపై రష్యా రాయబారి కీలక వ్యాఖ్యలు.. భారత్ ఆశలకు భంగపాటు!
Rupee Payments: అంతర్జాతీయ విపణిలో డాలర్ కు ప్రత్యామ్నాయంగా భారత్ రూపాయిని నిలపాలని మోదీ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ దేశాలతో లోకల్ కరెన్సీ ద్వారా బిజినెస్ చేసేందుకు చకచకా పావులు కదుపుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాతో ఏర్పడిన ప్రతిష్ఠంభన దీనికి మరింత ఆజ్యం పోశాయి.
భారత్‌తో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. అయితే చెల్లింపు సమస్యలు వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు బ్యాంకులు మరియు ఎగుమతిదారుల నుంచి అదనపు ప్రయత్నాలు అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు.

వోస్ట్రో ట్రేడ్ సెటిల్‌మెంట్ మెకానిజం (రూపాయి ద్వారా చెల్లింపు వ్యవస్థ) సరిగా పనిచేయలేదని పేర్కొన్నారు. MCCI నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. పేమెంట్స్ విధానాల్లో ఇబ్బందుల పరిష్కారానికి ఫైన్-ట్యూనింగ్ అవసరమని అంగీకరించారు. బ్యాంకులు సైతం ఇందుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, చెల్లింపు విధానం క్రమబద్ధీకరించబడిన తర్వాత వాణిజ్య వృద్ధి ఊహించిన మేర ఆశాజనకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. MSME రంగంలో మరింత సహకారం కోసం చూస్తున్నట్లు చెప్పారు. ఇంధనం, రక్షణ, అంతరిక్షం, లాజిస్టిక్స్, విద్య, రైల్వేలు మరియు ఆతిథ్య రంగాలపై ఆసక్తిని కనబరిచారు. FY23లో ద్వైపాక్షిక వాణిజ్యం 49 బిలియన్ డాలర్లకు చేరగా.. ఇండియాకు రష్యా నాల్గవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications