Rates Hike: ఇటీవల వరుసగా ప్రపంచంలోని అగ్రదేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
తాజాగా రష్యా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను అమాంతం పెంచేసింది. గతంలో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను మంగళవారం ఏకంగా 12 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించి పెద్ద ప్రకంపనను సృష్టించింది. అమెరికా ఫెడ్ దూకుడు తగ్గదంటూ ప్రకటించిన తర్వాత రేసులోకి చాలా దేశాలు ప్రవేశిస్తున్నాయి. అయితే రిస్క్ టూ ప్రైస్ స్టెబిలిటీ కోసమే తాము ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని రష్యా సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.

ఈ క్రమంలో ఒక్కసారిగా కీలక వడ్డీ రేట్లను 350 బేసిస్ పాయింట్లు పెంచటంపై ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తప్పకుండా గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని వారు అంటున్నారు. క్రెమ్లిన్ మందలింపు తర్వాత బ్యాంక్ ఆఫ్ రష్యా అసాధారణ సమావేశాన్ని నిర్వహించింది. రష్యా కరెన్సీ రూబూల్ సోమవారం డాలర్ తో పోల్చితే మారకపు విలువ 100 దాటింది.. ఈ క్రమంలో కరెన్సీ మరింతగా బలహీన పడకుండా ఆపేందుకు కఠినమైన ద్రవ్య విధాన చర్యలకు ఉపక్రమించి రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
యుద్ధం వల్ల భారీగా సైనిక వ్యయాలు పెరగటం, రష్యా వాణిజ్య సమతుల్యతపై పాశ్చాత్య ఆంక్షల ప్రభావం, సోమవారం రూబుల్ మారకపు విలువ భారీగా పడిపోయిన నేపథ్యంలో ఈ అసాధారణ రేటు సమావేశం జరిగినట్లు వెల్లడైంది. దీనికి ముందు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్థిక సలహాదారు మాగ్జిమ్ ఒరేష్కిన్ సోమవారం సెంట్రల్ బ్యాంక్ బలహీనపడుతున్న రూబుల్‌పై దాని మృదువైన ద్రవ్య విధానాన్ని తప్పుపట్టారు. ఒరేష్కిన్ చెప్పిన కొన్ని గంటల తర్వాత.. డాలర్‌తో పోలిస్తే రూబుల్ 102 మార్కుకు చేరుకోవడంతో కఠిన చర్యలు వెలువడ్డాయి. చివరిసారిగా ఫిబ్రవరి 2022 చివరలో అత్యవసర రేటు పెంపును రష్యా సెంట్రల్ బ్యాంక్ చేపట్టింది.
ప్రస్తుతం ఇండియా-రష్యాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం కారణంగా రెండు దేశాలు రూపీ-రూబుల్ చెల్లింపు విధానాన్ని తమ వాణిజ్యంలో అవలంభిస్తున్నాయి. అయితే తాజా రేట్ల పెంపు ఈ చెల్లింపులను ప్రభావితం చేయవచ్చని.. ఖర్చులను మరింతగా పెంచవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రేపు భారత స్టాక్ మార్కెట్లతో పాటు, ఆసియా మార్కెట్లపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపి నష్టాలకు దారితీయెుచ్చని వారు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications