Russia Ukraine crisis: 100 డాలర్లకు చేరిన క్రూడ్, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంటుందనే నిపుణుల అంచనాలను నిజం చేస్తూ, నేడు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ ప్రకటన తర్వాత క్రూడ్ ధరలు అంతకంతకూ పెరిగాయి. ఈ వార్త రాసే సమయానికి బ్రెంట్ క్రూడ్ 6.89 శాతం ఎగిసి 100.53 డాలర్లు, వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధరలు 7.06 శాతం ఎగిసి 98.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ నేడు ఓ సమయంలో 100 డాలర్లను దాటగా, బ్రెంట్ ఏకంగా 102 డాలర్లు క్రాస్ చేసింది.
డిసెంబర్ 1, 2021 తర్వాత క్రూడ్ ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. డిసెంబర్ 1కి ముందు ధరలు 70 డాలర్ల వద్ద ఉన్నాయి. అంతకుముందు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, ఆ తర్వాత ద్రవ్యోల్భణం ఆందోళనల కారణంగా క్రూడ్ ధరలు కాస్త పెరుగుతూ వచ్చాయి. అయితే ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏకంగా 100 డాలర్లకు చేరుకున్నాయి.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు ఆయా దేశాల్లో వినియోగదారుల పైన ప్రభావం చూపుతాయి. క్రూడ్ ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్, నేచరల్ గ్యాస్ ధరలు పెరుగుతాయి. మన దేశంలో నవంబర్ నుండి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. కానీ అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగాయి. వివిధ దేశాల్లో ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మన వద్ద కూడా త్వరలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే, దిగుమతి భారమై, దేశీయంగా ద్రవ్యోల్భణం పెరుగుతుంది. చమురు వినియోగంలో భారత్ 80 శాతం వరకు దిగుమతుల పైనే ఆధారపడి ఉంది. అలాగే, మొత్తం దిగుమతుల్లో చమురు దిగుమతులు 25 శాతంగా ఉన్నాయి. చమురు ధరలు పెరిగితే, మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఈ ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతుంది. అప్పుడు ద్రవ్యోల్భణం పెరుగుతుంది.


Click it and Unblock the Notifications