ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో వీడేలా కనపడటం లేదు. దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. చాలా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకునేందుకు ముందడుగు వేస్తున్నాయి. తాజాగా రష్యా కూడా ఈ యుద్ధ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడుకునేందుకు రెడీ అయింది.
రష్యా ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవడానికి అత్యంత విలువైన ఆస్తులను వదులుకుంటోంది. గత రెండు దశాబ్దాలుగా రష్యా తన ఆర్థిక వ్యవస్థను చమురు, సహజ వాయువుల ఎగుమతులపైనే నిర్మించుకుంది. అయితే, ఉక్రెయిన్‌తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం ఆ పునాదులను కదిలించివేసింది. యుద్ధం నాలుగో ఏట అడుగుపెట్టిన వేళ, రక్షణ రంగానికి అవుతున్న ఖర్చులు ఆకాశాన్ని తాకుతుంటే.. మరోవైపు పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం రష్యా ఖజానాకు గండి కొట్టాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఆదాయంలో సగానికి పైగా వాటా కలిగిన ఇంధన వనరులు, ఇప్పుడు కేవలం 20 శాతానికి పరిమితం కావడం ఆ దేశ ఆర్థిక ఒత్తిడికి నిదర్శనం.

ఈ క్రమంలోనే రష్యా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 25 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా, తన ఖజానాలో భద్రంగా దాచుకున్న భౌతిక Gold కడ్డీలను బయటకు తీసి మార్కెట్లో విక్రయించడం ప్రారంభించింది. గతంలో ఇలాంటి లావాదేవీలు కేవలం కాగితాల మీద లేదా డిజిటల్ రూపంలోనే జరిగేవి. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా Gold అమ్మడం అంటే రష్యాకు నగదు (Liquidity) ఎంత అత్యవసరమో అర్థం చేసుకోవచ్చు. 2026 సంవత్సరం ప్రారంభం కాగానే, కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు 14 టన్నుల బంగారాన్ని రష్యా విక్రయించింది. జనవరిలో 3 లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో మరో 2 లక్షల ఔన్సుల బంగారాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా తన పెరుగుతున్న బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 5 వేల డాలర్లు దాటి ఉండటం రష్యాకు ఒక విధంగా కలిసి వచ్చింది. గరిష్ట ధరలు ఉన్న సమయంలో బంగారాన్ని అమ్మడం ద్వారా రష్యా తన విదేశీ మారక నిల్వల విలువను 800 బిలియన్ డాలర్ల పైనే నిలబెట్టుకోగలిగింది. అయినప్పటికీ, ఇది ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఎందుకంటే, ఒక దేశం తన 'సేఫ్టీ వాల్ట్'గా భావించే బంగారాన్ని విక్రయించడం ప్రారంభించిందంటే, అది ఆ దేశ ఆర్థిక భద్రతా కవచం బలహీనపడుతోందనే సంకేతాన్ని ప్రపంచానికి ఇస్తుంది. రష్యా వద్ద ఇప్పటికీ 2,000 టన్నులకు పైగా బంగారం ఉన్నప్పటికీ, యుద్ధ వ్యయం ఇలాగే కొనసాగితే ఆ నిల్వలు కూడా వేగంగా కరిగిపోయే ప్రమాదం ఉంది.
ఈ పరిణామం కేవలం రష్యాకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ రష్యా తన నిల్వల నుండి భారీ ఎత్తున బంగారాన్ని మార్కెట్లోకి వదిలితే, అది బంగారం ధరల స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చు. చివరకు, రష్యా ఆర్థిక భవిష్యత్తు అనేది యుద్ధం ఎంత త్వరగా ముగుస్తుంది మరియు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయి అనే అంశాలపైనే ఆధారపడి ఉంది. ఆదాయం పెరగకుండా కేవలం ఆస్తులను అమ్ముకుంటూ పోతే, భవిష్యత్తులో రష్యా మరిన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications