బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధమేఘాలను కొన్ని దేశాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. బడ్జెట్ లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే చైనా పసిడి అమ్మకాల ద్వారా తన లోటును పూడ్చుకోగా తాజాగా ఇదే బాటలో రష్యా చేరింది. రష్యా తన పెరుగుతున్న బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి తన వద్ద ఉన్న విలువైన Gold నిల్వలను విక్రయించడం ప్రారంభించింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అందించిన తాజా గణాంకాల ప్రకారం.. 2026 సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే రష్యా సుమారు 15 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2002వ సంవత్సరం తర్వాత రష్యా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో రష్యా తన బంగారు లావాదేవీలను కేవలం అంతర్గతంగా, అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి సెంట్రల్ బ్యాంక్‌కు మాత్రమే పరిమితం చేసేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్ కార్యకలాపాలకు దిగడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఉన్న తీవ్రమైన ఒత్తిడికి అద్దం పడుతోంది.

అధికారిక వివరాల ప్రకారం.. రష్యా సెంట్రల్ బ్యాంక్ జనవరిలో 3,00,000 ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని, ఫిబ్రవరిలో మరో 2,00,000 ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని విక్రయించింది. దీనివల్ల దేశ మొత్తం బంగారు నిల్వలు 74.3 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు పడిపోయాయి. ఇది మార్చి 2022 తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి.
పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యాకు చెందిన సుమారు 300 బిలియన్ డాలర్ల విదేశీ ఆస్తులు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న కొద్దిపాటి విదేశీ కరెన్సీ (ముఖ్యంగా చైనీస్ యువాన్) నిల్వలను కాపాడుకోవడానికి రష్యా బంగారాన్ని ద్రవ్య వనరుగా మార్చుకుంటోంది.
రష్యా ఆర్థిక లోటు అంచనాలను మించిపోతోంది. 2022 నుండి 2025 మధ్య కాలంలో ఫెడరల్ బడ్జెట్ లోటు 15 ట్రిలియన్ రూబుల్స్ ($183 బిలియన్లు) దాటగా, ఈ ఏడాది ప్రారంభ రెండు నెలల్లోనే అదనంగా 3.5 ట్రిలియన్ రూబుల్స్ ($42.7 బిలియన్లు) లోటు నమోదైంది. జనవరిలో జరిపిన బంగారు అమ్మకాల ద్వారా సుమారు 120 బిలియన్ రూబుల్స్ సమకూరినప్పటికీ, అది భారీగా ఉన్న బడ్జెట్ లోటులో కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే భర్తీ చేయగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు డాలర్‌పై ఆధారపడటం తగ్గించి బంగారాన్ని నిల్వ చేసుకుంటున్న తరుణంలో, రష్యా దానికి విరుద్ధంగా నిల్వలను అమ్ముకోవాల్సి రావడం ఆ దేశం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లను సూచిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications