Russia-India: హ్యాండ్ ఇచ్చిన చైనా.. ఇండియాపై కోటి ఆశలు పెట్టుకున్న రష్యా పుతిన్..
Russian Coal: రష్యా ఉక్రెయిన్ వార్ దాదాపు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పుతిన్ సర్కార్ ఇండియాపై తన దృష్టిని సారిస్తోంది. అతిపెద్ద వినియోగదారు చైనా హ్యాండ్ ఇచ్చిన వేళ రష్యా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రష్యా తన బొగ్గు ఎగుమతులను పెంచేందుకు ఇండియాపై దృష్టి సారిస్తోంది. సాధారణంగా రష్యా నుంచి బొగ్గును కొనుగోలు చేసే అతిపెద్ద దేశం చైనా. అయితే చైనా ఇప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని దశలవారీగా నిలిపివేయాలని చూస్తోంది. దీంతో బొగ్గు దిగుమతులను తగ్గించుకోవాలని చైనా నిర్ణయించింది. కాబట్టి చైనా తర్వాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశమైన భారత్‌కు బొగ్గు ఎగుమతులను పెంచాలని రష్యా నిర్ణయించింది. ఇదే విషయాన్ని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఇటీవల ప్రకటించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ అందుకునేందుకు ఇండియాలో బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లను ఎక్కువగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.

భారతదేశానికి సంబంధించినంత వరకు గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 997.828 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. 2023 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో దాదాపు 75 శాతం బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతోంది. ఈ క్రమంలో దాదాపు 176 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటుందని అంచనా వేయబడింది. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది. రష్యా విషయానికొస్తే గతేడాది భారత్‌కు 26.2 మిలియన్ టన్నుల బొగ్గును ఎగుమతి చేసింది. రష్యా ఇప్పటికే భారత్‌కు పెద్ద మెుత్తంలో ముడి చమురును అమ్ముతోంది. రష్యా కూడా బొగ్గు అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది. ఉక్రెయిన్‌తో వివాదం నేపథ్యంలో అనేక పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేశాయి. రష్యా కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు కూడా విధించబడ్డాయి.
ఈ క్రమంలో అత్యధికంగా చమురు దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత కంపెనీలకు తగ్గింపు ధరలకు ముడి చమురును రష్యా విక్రయిస్తోంది. ఇప్పుడు ముడి చమురుతో పాటు బొగ్గు ఎగుమతులను సైతం పెంచాలని రష్యా నిర్ణయించింది. మొదటి దశలో తగ్గింపు ధరలకు కూడా బొగ్గును సరఫరా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరోపక్క భారత ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ అయిన సోలార్, విండ్ ఎనర్జీ రంగాలపై తమ దృష్టిని పెంచుతోంది. గ్రీన్ ఎనర్జీని అందుబాటులోకి తీసుకురావటం ద్వారా కర్భన ఉద్ఘారాలను తగ్గించాలని నిర్థేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. దేశంలో పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం తక్షణమే సాధ్యం కాని పరిస్థితి ఏర్పడటంతో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఆపరేట్ చేయబడుతున్నాయి.


Click it and Unblock the Notifications