Russia News: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం రెండుగా విడిపోయింది. వార్ మొదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇరు దేశాలు, వాటికి మద్ధతిచ్చే వాటిపైనా యుద్ధం ప్రభావం క్షుణ్ణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు విషయంలో ఇది మరింత ఎక్కువనే చెప్పాలి. అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షల పేరుతో రష్యాను ఏకాకిని చేయాలని ప్లాన్ చేశాయి. అయితే నమ్మకమైన మిత్రదేశం భారత్ అండతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ వాటికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే సాయం భారత్ కొంప ముంచేలా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం వల్ల పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక మరియు వాణిజ్య ఆంక్షలు విధించడంతో యూరోపియన్ దేశాలతో ఉన్న సత్సంబంధాలను కోల్పోయింది. దీంతో తన ముడి చుమురును విక్రయించి ఎలాగైనా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే తపనతో అతి తక్కువ ధరకే ఆయిల్ విక్రయించడం మొదలుపెట్టింది. ఇది భారతీయ రిఫైనర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. యుద్ధానికి ముందు భారత్ ముడి చమురు దిగుమతుల్లో 1 శాతంగా ఉన్న రష్యా వాటా మొదటి 5 నెలల్లోనే 42 శాతానికి పెరిగింది.

రష్యా నుంచి ముడి చమురు ఎగుమతులు పెరగడం కారణంగా ఇరాక్, సౌదీ అరేబియా, UAE మరియు US వంటి దేశాలతో భారత్‌కు ఉన్న వాణిజ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అవి ఇండియాకు చమురు సరఫరాను నిలిపివేస్తున్నాయి. ఇదే సమయంలో దక్షిణ అమెరికా దేశాలకు రష్యా తన ఆయిల్ సరఫరాను పెంచింది. ఇది భారతీయ రిఫైనర్లకు ప్రతికూలంగా పరిణమించింది.
గతంలో భారతీయ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసే రష్యా చమురులో ఎక్కువ భాగం యూరప్‌కు ఎగుమతి అయ్యేది. ఫలితంగా అమెరికా పంపిణీ సంస్థలు గట్టి పోటీని ఎదుర్కొన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. కానీ ఇటీవల రష్యా తన డీజిల్ ఉత్పత్తిని దక్షిణ అమెరికాకు పెంచడంతో, అక్కడ US వాణిజ్యం తీవ్ర సమస్యలను ఎదుర్కొంది. ఫలితంగా అమెరికా తన చమురు ఉత్పత్తిని మిత్రదేశమైన ఐరోపాకు మార్చింది. దీంతో భారత్ ఎగుమతులు పరోక్షంగా దెబ్బతిన్నాయి.
ఏప్రిల్-ఆగస్టు 2024 మధ్య ఐరోపాకు భారత్ డీజిల్ ఎగుమతులు రోజుకు 1.5 లక్షల బ్యారెళ్లకు (TBD) పడిపోయాయి. గత సంవత్సరం స్థాయిలతో పోలిస్తే ఏకంగా మూడో వంతు తగ్గింది. దీనికితోడు ఇంధన డిమాండ్ సైతం మందగించడం, ఆగ్నేయాసియా మరియు తూర్పు ఆఫ్రికాలో ఆర్థిక మందగమనం వెరసి భారతీయ రిఫైనర్లు మరింత ప్రభావితమయ్యాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో చమురు ఎగుమతులు 6 శాతం క్షీణించాయి. ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు కూడా యూరప్‌కు భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి.


Click it and Unblock the Notifications