భారీగా బలపడిన రూపాయి, నాటి నుండి ఏకంగా 185 పైసలు జూమ్
ఇండియన్ కరెన్సీ కొద్ది రోజులుగా బలపడుతోంది. గురువారం నాడు డాలర్ మారకంతో బలపడి మూడు నెలల గరిష్టానికి చేరుకొని ఓ సమయంలో 74.50 వద్ద ట్రేడ్ అయింది. అనంతరం 75.01 వద్ద క్లోజ్ అయింది. ఇంటర్ ఫారెక్స్ మార్కెట్లో నిన్నటితో పోల్చితే 9 పైసలు బలపడి 75.51 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిన్నటి సెషన్‌లో 75.60 వద్ద క్లోజ్ అయింది. నేటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా పుంజుకుంది.

భారీగా పుంజుకున్న రూపాయి
ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, దేశీ స్టాక్స్‌లో FPIల పెట్టుబడులు పెరగడం వంటి అంశాలు రూపాయికి బలాన్నిచ్చాయి. దీంతో అంతకంతకూ బలపడింది. డాలర్ మారకంతో 59 పైసలు లేదా 0.8 శాతం బలపడి 75.01 వద్ద ముగిసింది. కరోనా కేసులు, అంతర్జాతీయ పరిణామాలు, సరిహద్దు అంశాలు గతకొద్ది రోజులుగా రూపాయిపై ప్రభావం పడింది.

ఒక్కరోజే 59 పైసలు బలపడింది
ఏప్రిల్ 23వ తేదీ తర్వాత ఒకేరోజు అత్యధికంగా బలపడింది రూపాయి. ఒక దశలో 75 కంటే దిగువకు వచ్చి ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మొత్తానికి మార్చి 27వ తేదీ 75 స్థాయికి చేరుకుంది. నిన్నటితో ఏకంగా 59 పైసలు బలపడింది. నిన్న 75.60 వద్ద క్లోజ్ కాగా, నేడు 75.01 వద్ద క్లోజ్ అయింది.

185 పైసలు జూమ్
డాలర్ మారకంతో రూపాయి దాదాపు రూ.77 సమీపానికి చేరుకొని, 76.86 వద్ద కూడా ట్రేడ్ అయింది. ఆ గరిష్టంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 185 పైసలు (నేడు క్లోజింగ్ 75.01) పుంజుకుంది. భారత్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశానికి వివిధ దేశాల మద్దతు, ఇది మనకు సానుకూలంగా ఉండటం, కరోనా వ్యాక్సిన్ పురోగతిపై సానుకూల ఫలితాలు వంటి అంశాలు కలిసి వచ్చాయని, దీంతో మూడు నెలల గరిష్టాన్ని తాకిందని చెబుతున్నారు.

ఆ కరెన్సీల్లో డాలర్ వీక్
ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలర్ ఇండెక్స్ 97కు పడిపోవడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపిందని చెబుతున్నారు. గత నెలలో యూరోజోన్, యూకేల తయారీ రంగం అంచనాలు మించాయని వార్తలు వచ్చాయి. దీంతో డాలర్ మారకంతో పోలిస్తే యూరో, యూకే పౌండ్ పుంజుకుంది.

లాభాల్లో ముగిసిన మార్కెట్లు
మరోవైపు ఈ రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభాలు చవిచూశాయి. సెన్సెక్స్ 429 పాయింట్లు ఎగిసి 35,843 పాయింట్ల వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు ఎగిసి 10,551 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో కార్ప్, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, వేదాంత, యూపీఎల్, హెచ్‌యూఎల్, జీ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications