డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ సినిమా ది రాజా సాబ్ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదట ఇది ఒక సరదా హారర్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే భావించినప్పటికీ.. తాజాగా బయటకు వచ్చిన బడ్జెట్ వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ సినిమా ఎంత పెద్ద స్థాయిలో తెరకెక్కుతోందో స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనుకోకుండా వెల్లడించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ గురించి సరదాగా మాట్లాడుతూనే ఈ సినిమా బడ్జెట్‌ను బయటపెట్టేశాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. ది రాజా సాబ్ బడ్జెట్ ఏకంగా రూ. 400 కోట్లు. ఇది వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ స్థాయి బడ్జెట్ ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్', మురుగదాస్ దర్శకత్వం వహించిన భారీ ప్రాజెక్ట్‌ల స్థాయిలోనే ఉంటుంది. ఒక హారర్ కామెడీకి ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం అంటే మేకర్స్ ఎంత గ్రాండ్‌గా సినిమాను ప్లాన్ చేశారో అర్థమవుతోంది.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా బడ్జెట్ విషయంలో ఆయన ఇప్పటివరకు పూర్తి గోప్యత పాటించారు. అయితే, ప్రభాస్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, అలాగే సందీప్ రెడ్డి వంగా కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో The Raja Saab సినిమా బడ్జెట్ లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.
ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ సినిమాను చాలా త్వరగా పూర్తి చేస్తానని చెప్పారు. దీనిపై సందీప్ రెడ్డి వంగా సరదాగా సెటైర్ వేస్తూ.. భారీ సెట్లు, ముగ్గురు హీరోయిన్లు, ఎన్నో పాటలు, ఒక బామ్మ క్యారెక్టర్, పైగా రూ. 400 కోట్ల బడ్జెట్... ఇవన్నీ పెట్టుకుని కేవలం 40 రోజుల్లో సినిమా పూర్తి చేస్తానని ప్రభాస్ చెప్పాడు అంటూ నవ్వుతూ అసలు బడ్జెట్‌ను బయటపెట్టేశారు. దీంతో అభిమానుల్లో హడావుడి మొదలైంది.
ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో సినిమా బడ్జెట్ గురించి పరోక్షంగా మాట్లాడారు. నిజమైన ఫిగర్ చెప్పను కానీ, బడ్జెట్‌లో చాలా సున్నాలు ఉంటాయని నవ్వుతూ చెప్పడంతో.. వంగా చెప్పిన రూ. 400 కోట్ల అంచనాలకు బలం చేకూరింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ కోసమే దాదాపు 120 రోజులు షూటింగ్ చేశారని తెలుస్తోంది. తెరపై సుమారు 40 నిమిషాల పాటు సాగే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ విజువల్ వండర్‌లా ఉంటుందని నిర్మాత భారీ హైప్ ఇచ్చారు.
ఇక విడుదల విషయానికి వస్తే.. ది రాజా సాబ్ జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపునకు కూడా అనుమతి లభించింది. జనవరి 8న జరిగే ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ. 1000గా నిర్ణయించారు. అలాగే మొదటి 10 రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం, టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్‌పై రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 పెంపు చేశారు. దీంతో టికెట్ ధరలు వరుసగా రూ.297, రూ.377కు చేరాయి. ఏదేమైనా టికెట్ రేట్ల పెంపుతో ది రాజా సాబ్'కు ఓపెనింగ్స్ మోత మోగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications