కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 15) వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి ఉద్దీపనలను ప్రకటించారు. డెయిరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు సంబంధించి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఔషధ మొక్కలపై కీలక ప్రకటన చేశారు.
ఔషధ మొక్కల సాగుకు రూ.4వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. మూలికా సాగును 10 లక్షల హెక్టార్ల వరకు తీసుకు రావాల్సి ఉందన్నారు. తద్వారా రైతులకు రూ.5,000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. మూలికా మరియు ఔషధ మొక్కల పెంపకం కోసం గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇరువైపులా 800 హెక్టార్లలో పెంచనున్నట్లు తెలిపారు.

జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఆధ్వర్యంలో 2.5 లక్షల హెక్టార్లలో దీనిని ముందుకు తీసుకెళ్తామన్నారు. రానున్న రెండేళ్లలో మరో 1 లక్ష హెక్టార్లకు విస్తరిస్తామని చెప్పారు. ఈ మొక్కల సాగును ప్రోత్సహిస్తామన్నారు.
తేనె, పట్టు పరిశ్రమ కోసం రూ.500 కోట్లు, మత్స్య సంపద కోసం రూ.20వేల కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు రూ.500 కోట్లు, పశుసంవర్ధక అభివృద్ధికి రూ.15వేల కోట్లు, ఆహార రంగంలో సూక్ష్మ పరిశ్రమలకు రూ.10వేల కోట్లు, పశువుల్లో వ్యాధుల నియంత్రణకు రూ.13,343 కోట్లు, రొయ్యల సాగు, చేపల వేటకు రూ.11వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications