రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 15) వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి ఉద్దీపనలను ప్రకటించారు. డెయిరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులు తదితరాలకు ఇచ్చే వాటిని ప్రకటించారు. చెరకు, పత్తి, వేరుశనగ వంటి ఉత్పత్తుల్లో ప్రపంచంలో మనం రెండో స్థానంలో ఉన్నామన్నారు. పప్పులు, జూట్ ఉత్పత్తులు, పాల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్నామన్నారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినట్లు చెప్పారు. వర్షాభావం, వాతావరణ సమస్యలు అధిగమించి రైతులు శ్రమిస్తున్నారన్నారు.

వ్యవసాయ మౌలిక రంగాల అభివృద్ధికి రూ.1 లక్ష కోట్లు
గత రెండేళ్లలో ఫసల్ బీమా యోజన కింద రూ.6,400 కోట్ల పరిహారం ఇచ్చినట్లు చెప్పారు. రూ.74,300 కోట్ల మేర కనీస మద్దతు ధర మేరకు కొనుగోళ్లు జరిపినట్లు చెప్పారు. పంట కొనుగోళ్లకు సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. వ్యవసాయ, మౌలిక రంగాల అభివృద్ధి కోసం రూ.1 లక్ష కోట్లు ప్రకటించారు ఆర్థికమంత్రి.

పాడి రైతులకు ప్రత్యేక పథకం
లాక్ డౌన్ సమయంలో పాల ఉత్పత్తి 20% నుండి 25% తగ్గినట్లు చెప్పారు. కరోనా -లాక్‌డౌన్ వల్ల ప్రస్తుతం పాల సేకరణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. దీంతో సహకార డైరీల ద్వారా మిగులు పాలను సేకరించినట్లు చెప్పారు. పాల సేకరణ ద్వారా పాడి రైతులకు రూ.4,100 కోట్ల మేర ప్రయోజనం కలిగించామని చెప్పారు. 2 కోట్ల మంది పాడి రైతులకు రూ.5వేల కోట్ల మేర ప్రోత్సాహకం ఇస్తున్నట్లు తెలిపారు. పాడి ఉత్పత్తిదారులకు ప్రత్యేక పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. సహకార రంగాల్లోని డెయిరీలకు 2 శాతం వడ్డీ రాయితీ ప్రకటించారు.

సూక్ష్మ పరిశ్రమలకు రూ.10వేల కోట్లు
గడువు తీరిన 242 అక్వా హ్యాచరీస్‌కు గడువును మూడు నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు రూ.10వేల కోట్లు ప్రకటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిది నుండి రైతులకు రూ.18,700 కోట్లు బదలీ చేసినట్లు తెలిపారు. మత్స్యకార రంగంలో 55 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, బోట్లు, బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. రానున్న 5 ఏళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను ఉత్పత్తి చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రస్తావన
తెలంగాణలోని పసుపు, ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చికి అంతర్జాతీయ వ్యాప్తంగా మార్కెట్ ఉందని తెలుగు రాష్ట్రాల పేర్లను నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక ప్రత్యేక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications